ప్రజాశక్తి-విజయవాడ
విద్యార్థి దశ నుండే ఆరోగ్య సూత్రాలను పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని సబ్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని లబ్బీపేట ఎంకే బేగ్ పాఠశాలలో విద్యార్థులకు సబ్ కలెక్టర్ అదితి సింగ్ అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రతి ఆరు నెలలకు ఒకసారి 1-19 సంవత్సరాల వయసున్న పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భోజనానికి ముందు, తరువాత, ఆడుకున్న తరువాత 20 సెకన్ల చొప్పున చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, దీనితో చాలావరకు నులిపురుగులు రావడం తగ్గిపోతుందన్నారు. నులిపురుగులు ఉండడం వల్ల చదువులో శ్రద్ధ తక్కువగా ఉంటుందని, అనేక రకాల అనారోగ్యాలు కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తహేరా సుల్తానా, నార్త్ తహశీల్దార్ దుర్గా ప్రసాద్, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సైరాబాను పాల్గొన్నారు.
ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణకు మందు బిళ్లలు పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ వివి శివ కోటేశ్వరరావు, కౌన్సిలర్ వట్టెం మనోహర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ షాలిన, డాక్టర్ వాసంతి, డాక్టర్ మోహన తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-భవానీపురం: 44వ డివిజన్‌లోని లేబర్ కాలనీలో ఉన్న జిఎన్‌ఆర్ హైస్కూల్లో జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మైలవరపు దుర్గారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర, సైకాలజిస్ట్ దుర్గారావు, సూపర్‌వైజర్ జానీ బాషా, స్కూల్ హెడ్ మాస్టర్ వి.వి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 40వ డివిజన్ గాంధీబొమ్మ రోడ్డులోని విజేత హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, అనూష పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ మందులు పంపిణీ చేశారు. వన్‌టౌన్‌లోని శ్రీ తేలప్రోలు రాజా, అన్నపూర్ణ మున్సిపల్ స్కూల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం డాక్టర్ సునీల్ పర్వవేక్షణలో పిల్లలకి మందులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజా హైస్కూల్ హెడ్‌మాస్టర్ హనుమంతరావు, పి.రామకృష్ణ, పిళ్లా ఆనంద్, ఎం.అప్పారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-వత్సవాయి: మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్లో, బీసీ గురుకులాల్లో మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి జడ్పిటిసి దేవమణి, శ్రీనివాస్, ఎండిఓ ప్రసాద్, ఎంఈఓ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ సుష్మ పాల్గొన్నారు. ప్రజాశక్తి-రెడ్డిగూడెం: రెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మల్లాది రాణి, ఎండిఓ పి శంకరరావు ఎంఈఓ రఘురాం పాల్గొన్నారు.










