Sep 13,2023 18:08

ప్రజాశక్తి - భీమడోలు
   ప్రతిఒక్కరూ తమ ఆరోగ్య సమాచారాన్ని, గతంలో తీసుకున్న స్కానింగ్‌ రిపోర్టులను, వివిధ వైద్య పరీక్షల వివరాలను తమకు ప్రత్యేకించిన డిజిటల్‌ హెల్త్‌ ఐడిలో భద్రపరుచుకోవాలని పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్‌ లీలా ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్మూ ఆన్‌లైన్‌ విధానంలో ఆయుష్మాన్‌భవ్‌ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించిన నేపథ్యంలో ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలలో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచి సుజాత ప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పురవీధులలో నిర్వహించిన ర్యాలీలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మాట్లాడుతూ ప్రతీ ఇంటికీ వచ్చి ఆరోగ్య సిబ్బంది కుటుంబీకుల ఆరోగ్య సమాచారం తెలుసుకుంటారన్నారు. అందుబాటులో ఉన్న వైద్యాన్ని అందజేస్తారన్నారు. అవసరం మేరకు పరీక్షలను నిర్వహించి, మేలైన వైద్యం కోసం నిపుణులకు సిఫార్సు చేస్తారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే విధానాన్ని తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి పర్యవేక్షకులు కిషోర్‌, ఇతర ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.