ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : యువతలో దాగున్న ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదం చేస్తాయని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని భువనచంద్ర టౌనుహాలులో యువజన సర్వీసుల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో శుక్రవారం యువజనోత్సవాలు-2023 నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, స్టెప్ సిఇఒ పల్లవి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, డిఆర్‌డిఎ, చేనేత - జౌళిశాఖ, ఉద్యాన శాఖల స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. పల్నాడు పాటపై శంకర భారతిపురం విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది.
నవోదయంలో 247 దరఖాస్తులు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన ధ్యేయంగా ప్రతినెలా 14వ తేదీన నిర్వహిస్తున్న 'నవోదయం' కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో నిరుద్యోగ యువత నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 247 మంది ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న మినీజాబ్ మేళాకు 32 మంది హాజరు కాగా అందులో ఐదుగురు ఎంపికయ్యారు. వీరికి నియామక పత్రాలను కలెక్టర్ అందించారు. నవోదయంలో భాగంగా నకరికల్లు మండలం, ఉదరు నగర్‌కు చెందిన పలువురికి బ్యాంకు రుణాలకు సంబంధించి అర్హత పత్రాలిచ్చారు.
ఆరోగ్య సురక్ష పథకం పోస్టర్ ఆవిష్కరణ
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యసిబ్బందికి జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ సూచించారు. నరసరావుపేట పట్టణంలోని 2వ వార్డులో శుక్రవారం పర్యటించిన ఆయన ఆరోగ్యశ్రీ యాప్ ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి, సచివాలయ అధికారి మహాలక్ష్మి పాల్గొన్నారు.










