Apr 25,2023 23:57

అభివాదం చేస్తున్న చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి/అమరావతి : గుంటూరు, పల్నాడు జిల్లాలో ఇసుక మాఫియా నుంచి ఎమ్మెల్యే శంకర్రావు నెలకు రూ.20 కోట్లను సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చెల్లిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తనపై యర్రగొండపాలెంలో ఏకంగా మంత్రే రౌడీయిజం చేయడం ప్రభుత్వ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. మీరు రౌడీయిజం చేస్తే మనం పారిపోవాలా.. అని నిలదీశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇసుద దందా అంతా ఎమ్మెల్యే ద్వారా నడుస్తోందని, కృష్టానదిలో రోడ్డు వేసి మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌లో పేమెంట్‌ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేషన్‌ బండి వెనుక బండి పెట్టి బియ్యాన్ని సేకరించి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. టిడిపి హయాంలోనే దళితులకు ఎంతో గుర్తింపు ఇచ్చామని, ప్రతిభా భారతి, బాలయోగి వంటి నాయకులను ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టామని, అంటరానితనం నిర్మూలనకు జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ నియమించామని అన్నారు. దళితులు, ముస్లిములు ఇతర సామాజిక తరగతులకు టిడిపి అమలు చేసిన సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్‌ పేరు తీసేసి జగన్‌ పేరు పెట్టుకున్నారని, జగన్‌ దళిత ద్రోహి అని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం తన జీవితాశయమని, సంపద సృష్టితో పాటు ఆ సంపదను పేదలకు చేర్చడం ఎంతో ముఖ్యమని అన్నారు. నాగార్జున సాగర్‌ కాల్వల ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేయించలేదని విమర్శించారు. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని ఈ ప్రాంతంలో పనులకు టిడిపి హయాంలో శంకుస్థాపన చేశామని, టెండర్లూ పిలిచామని, ఆ పనులనూ ఈ ప్రభుత్వం ఆపేసిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టిడిపి పల్నాడు జిల్లా అద్యక్షులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నాయకులు బ్రహ్మారెడ్డి, కోవెలమూడి రవీంద్ర, నశీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.