Jun 20,2023 23:59

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం వల్ల జిల్లాలో ఖరీఫ్‌ పంట సాగుపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏటా జూన్‌ రెండో వారంలో తొలకరి వర్షాలు మొదలవుతాయి. అప్పటికే పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసిన రైతులు మెట్ట భూముల్లో అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయ పంటలను వేస్తుంటారు. కానీ జూన్‌ మూడో వారం ముగుస్తున్నప్పటికీ చినుక జాడ లేకపోవడం, పైగా ఎండలు తీక్షణంగా కాస్తుండడంతో ఖరీఫ్‌ సాగు జాప్యం అవుతుతోంది.
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు లక్షకు పైగా హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. జిల్లాలో ప్రధాన పంట వరి. దీన్ని దాదాపు 92 వేల హెక్టార్లలో పండిస్తుంటారు. చెరకు 3,755 వేల హెక్టార్లలో ఉంటుంది. మిగిలిన భూముల్లో మినుము, పెసర, వంటి అపరాల పంటలు, చోడి, జొన్న, సజ్జ వంటి చిరు ధాన్యాలు, నువ్వు వేరుశనగ వంటి నూనె గింజల పంటలు, పలురకాల కూర గాయ పంటలు పండిస్తుంటారు. చోడి, మొక్కజొన్న హెక్టార్లు, సజ్జ (గంటి) హెక్టార్లు, నువ్వు, కంది, వేరుశనగ, హెక్టార్లు, మినుమ 5 వేలకు పైగా హెక్టార్లలో పంటను సాగు చేస్తున్నారు. వరిలో దాదాపు 20 శాతం, చెరకులో 30 శాతం, మిగిలిన పంటల్లో దాదాపు 800 శాతం వర్షాధారంగానే రైతులు సాగు చేస్తున్నారు. ఏటా జూన్‌ మొదటి, రెండో వారంలో తొలకరి వర్షాలు మొదలవుతాయి. అప్పటికే భూములను సిద్దం చేసుకున్న రైతులు పంటలను విత్తుతుంటారు. సాధారణం ప్రస్తుత సమయానికి వర్షాధారంగా పండించే వరి, చెరకు, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలు వేసే పనుల్లో అన్నదాతలు నిమగమై ఉంటారు. ఇదే సమయంలో నీటి ఆధారంగా వరి పండించే భూములను దుక్కి
దున్ని, పచ్చి రొట్ట విత్తనాలు చల్లుతుంటారు.
ఈ ఏడాది వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. సుమారు ఆరు వారాల నుంచి వేసవి తీవ్రత అధికంగా వుండడం, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం, వర్షాల జాడ లేకపోవడంతో ఖరీఫ్‌ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడలేదని రైతులు ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయే తప్ప కుండపోతగా వర్షం పడిన దాఖలాలు లేవు. దీంతో సాధారణ సమయంతో పోలిస్తే ఖరీఫ్‌లో మెట్ట పంటల సాగు మూడు నుంచి నాలుగు వారాలు ఆలస్యం అయ్యే అవకాశం అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇంజన్లతో తోటను తడుపుకుందామన్నా ఎండిపోతుండడంతో రైతులకు పాలుపోవడంలేదు. చెరకు మొక్క తోటల కోసం విత్తనం సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం రెండు వారాల నుంచి ఎదురు చూస్తున్నారు. దీంతో చెరకు దవ్వ (మొక్క తోట) నాట్లు ఆలస్యమవుతాయని, దీనివల్ల చెరకు కట్టింగ్‌ జాప్యం అవుతుందని, ఫలితంగా దిగుబడి తగ్గుతుందని రైతులు అంటున్నారు.
ఎండిపోతున్న నువ్వు, కార్సీ చెరకు
జలాశయాలు, చెక్‌ డ్యాములు, గ్రోయిన్ల ఆధారంగా వరి సాగు చేసే భూముల్లో వేసవి పంటగా పలువురు రైతులు నువ్వు వేస్తుంటారు. ఈ ఏడాది కూడా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కురిసిన వర్షాలతో చాలా మంది రైతులు నువ్వు పంట వేశారు. తొలుత ఆశాజనకంగానే పెరిగిన నువ్వు మొక్కలు, గత నెల రోజుల నుంచి ఎండలు తీక్షణంగా కాస్తుండడం, చినుకు జాడ లేకపోవడంతో ఎండిపోతున్నాయి. వర్షాధారంగా సాగు చేసే కార్సీ చెరకు తోటల పరిస్థితి కూడా ఇలానే ఉంది.