Jul 17,2023 21:30

ఫొటో : వృద్ధురాలికి మేనిఫెస్టోను అందజేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ప్రతిఇంటికి సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-సీతారామపురం : ప్రతి ఇంటి గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసిపి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని దేవమ్మ చెరువు పంచాయతీలో ఉపసర్పంచ్‌ లకిడి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రముఖ శైవ క్షేత్రమైన ఘటిక సిద్ధేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దేవమ్మచెరువు, వేంపల్లితోక గ్రామాలలో ప్రతి ఇంటికి తిరిగి వైసిపి ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధికి సంబంధించిన కరపత్రాలను ఆయన లబ్ధిదారులకు అందించారు. పలువురు పింఛన్లు అందడం లేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం పారదర్శకంగా ప్రజలకు అందుతుందని తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా తెలుపుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కేవలం మాటలకే పరిమితం చేశాయని వైసిపి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాక మరికొన్ని పథకాలను అదనంగా ప్రవేశపెట్టి ప్రజలకు చేరుస్తూ ప్రజల అభిమానాన్ని పొందిందని తెలిపారు. ఎక్కడ చూసినా జగన్‌.. జగన్‌.. జగన్‌.. అనే నినాదమే వినిపిస్తుందన్నారు. మాజీసిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనను మించేలా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పరిపాలిస్తున్నాడని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బడుగు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెంటే ఉన్నారన్నారు. నిత్యం ప్రజల కోసం శ్రమిస్తూ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి సేవ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి, జెడ్‌పిటిసి చెరుకుపల్లి రమణారెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వైస్‌ ఎంపిపి నేలటూరి సారమ్మ, ఎంపిడిఒ రంగ సుబ్బరాయుడు, తహశీల్దారు షాజియాబేగం, ఎంఇఒ మస్తాన్‌వలీ, అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.