
- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ రామమోహనరావు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
ఎన్నో ఆంక్షలను చేధించుకుంటూ మహిళలు ప్రతీ రంగంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని, ఇది సమ సమాజ స్థాపనకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ రామమోహనరావు అన్నారు. సేఫ్ (స్టెప్ ఎ హెడ్ ఫర్ ఈక్వాలిటీ) - సిద్ధార్థ ఫార్మశీ కళాశాల సంయుక్తంగా విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరుగనున్న అంతర కళాశాలల సాంస్కృతిక ఉత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులలో లింగ సమానతపై చైతన్యం కల్పించడం కోసం ఇటువంటి సాంస్కృతిక పోటీలను నిర్వహించడం పట్ల సేఫ్ టీమ్‌ని ఆయన అభినందించారు. నేటికీ కొన్ని చోట్ల మహిళలు, విద్యార్థినులకు చదువు కోసం కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నారు. స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి ఉషా రాజ్యలక్ష్మి, సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో, ప్రతి ఇంట్లో మహిళల పాత్ర ఎంతో గొప్పదన్నారు. సేఫ్ అధ్యక్షులు జి.జ్యోత్న్స మాట్లాడుతూ పురుషాధిక్య భావజాల ప్రభావాల నుండి నేటి సమాజం పూర్తిగా బయటపడలేదన్నారు. మన ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, సనాతన ధర్మాలు సమాజంలో నేటికీ తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. వాటి నుండి బయటపడితే స్త్రీలు, స్వేఛ్చా సమానత్వం, స్వాతంత్య్రం సాధించలేరన్నారు. సమాజంలో స్త్రీలకు సముచిత స్థాణం కల్పించాలని వారి రక్షణ సామాజిక బాద్యతగా గుర్తించాలన్నారు. స్త్రీ పురుషులలో ముఖ్యంగా యువతరంలో ఈఅంశాలపై అవగాహన పెంచేందుకు విస్తృత చర్చ జరగాలని ఇందులో భాగంగానే సేఫ్ సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆచంట సునీత, కార్యక్రమ సమన్వయ కర్త డాక్టర్ చెంచు లక్ష్మీ, సేఫ్ కమిటీ సభ్యులు పి.వాణి, రత్న లక్ష్మీ, సుమ ఆట్లూరి, ఉషారాజ, పలువురు పాల్గొన్నారు.