Feb 01,2023 23:06

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌: పేదలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఏ గడపకు వెళ్లినా ప్రజలు పలు సమస్యలను విన్నవిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. సింగ్‌నగర్‌ 59వ డివిజన్‌ ఏకలవ్యనగర్‌లో గిరిజనులు, దళితులు నివసిస్తున్న ప్రాంతంలో బుధవారం సిపిఎం నాయకులు పర్యటించారు. స్థానికంగా నివసిస్తున్న ప్రజల సమస్యలు, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఎస్‌టి, ఎస్‌సిలు నివసిస్తున్న ప్రాంతంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుతున్నా బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. వికలాంగులకు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇప్పించడానికి స్లాట్‌ కేటాయించడంలేదన్నారు. జగనన్న చేయూత పథకం కింద ఒక్క సంవత్సరం మాత్రమే డబ్బులు ఇచ్చారని, అర్జీ పెట్టుకున్నా రానివారు చాలామంది ఉన్నారని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద రుణం పొందిన వారి దగ్గర భారీగా వడ్డీ వసూలు చేస్తున్నారని, బ్యాంకులో దాచుకున్న డబ్బులు అప్పు కింద జమ వేసుకుంటున్నారని చెప్పారు. మంచినీటి ఛార్జీలు రూ.15 వేలు కట్టాలని డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా జప్తు నోటీసులు ఇస్తున్నారని, కనెక్షన్లు కట్‌ చేస్తున్నారని తెలిపారు. సామాన్య పేదలకు చెత్త, నీటి పన్నులు భారంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కె.కృష్ణమురారి, మూర్తి, కుంభా పుల్లయ్య, కూచిపూడి ఆందోని తదితరులు పాల్గొన్నారు.