శ్రీ రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దు శ్రీ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలాక్కియా
ప్రజాశక్తి -కరప
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ మద్దతు ధరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియా భరోసా ఇచ్చారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను, ఆర్‌బికెల ద్వారా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియతో పాటు కళ్లాలపై ఉన్న ధాన్యాన్ని పరిశీ లించేందుకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం కరపలో పర్యటించారు. పెనుగుదురులో వరి పొలా లను, కళ్లాలల్లో ఉన్న ధాన్యపు రాశుల్ని పరిశీ లించి, రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందన వసరం లేదని రైతుల ధాన్యాన్ని సకాలంలో ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు జరిగిందని.. లక్ష్యాలతో సంబంధం లేకుండా బొండాలు రకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు సంబంధించి వదంతులను నమ్మొద్దని సూచించారు. జిల్లాలో 12 బాయిల్డ్ రైస్ మిల్లులు న్నాయని.. సామర్లకోట, పెదపూడి తదితర మండలాల నుంచి బొండాలు రకం ధాన్యం బాయిల్డ్ మిల్లులకు వస్తున్నాయని తెలిపారు. అధికారులు, ఆర్‌బికె సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి.. రైతులకు అవసరమైన సహాయ సహాకారాలు అందించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ తెలిపారు.
పంట పొలాలను పరిశీలించిన అనంతరం పెనుగుదురులో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష కార్యక్రమంలో భాగంగా సాగుతున్న స్టోన్ ప్లాంటేషన్ పనులను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియ వెంట డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కరప తహశీల్దారు శ్రీనివాస్, ఎంపిడిఒ కె.స్వప్న జడ్‌పిటిసి వై.సుబ్బారావు ఎంపిపి పి.శ్రీలక్ష్మీ సత్తిబాబు ఉన్నారు.
పెనుగుదురులో రైతులు చూపిస్తున్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జ్ కలెక్ట్ ఇలాక్కియా, అధికారులు










