ప్రజాశక్తి-చిలకలూరిపేట : ప్రతి గడపకూ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో 45 రోజులపాటు అమలు చేసే ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరీక్షలతోపాటు అవసరమైన వారికి అందించేందుకు 107 రకాల మందులు సిద్ధం చేశామన్నారు. కీలక కేసులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు సిఫార్సు చేస్తారని చెప్పారు. ప్రజలకు ఇచ్చే కేస్ షీట్‌లో సమగ్ర వివరాలు ఉంటాయని, ఎక్కడికెళ్లినా వైద్యం పొందడానికి సులవవుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 10574 ఆరోగ్య సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 14 రకాల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ డాక్టర్ హరేంద్ర ప్రసాద్, పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడారు. చైల్డ్ హెల్త్ జెసి డాక్టర్ కె.అర్జునరావు, డిసిహెచ్‌ఎస్ బీవీ రంగారావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి, మున్సిపల్ చైర్‌పర్సన్ షేక్ రఫాని, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ కుమారి పాల్గొన్నారు.










