ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా జనవరిలోనే జాబ్ కేలండర్ ప్రకటిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి సమీపంలోని యర్రబాలెంలో బుధవారం నిర్వహించిన 'హలో లోకేష్' కార్యక్రమంలో యువత వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సందేహాలకు లోకేష్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలుచేసి విద్యార్థుల కష్టాలకు చెక్ పెడతామన్నారు. ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో ఉండిపోయిన 2 లక్షలమంది సర్టిఫికెట్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా విద్యార్థులకు ఇప్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ప్రతిఏటా జాబ్ కేలండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. యుపిఎస్‌సి మాదిరి ఎపిపిఎస్‌సిని పటిష్టపర్చి, నిర్ణీత సమయాల్లో ఉద్యోగాలకు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియమకాలు చేస్తామని చెప్పారు నాలుగేళ్లుగా యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని, నిరుద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్తున్నారని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
మార్పు కోరుకుంటే ఓటేయండి
సమాజంలో మనం కోరుకునే మార్పు రావాలనుకునేవారు.. ఆ మార్పు ముందు మనలో రావాలని గాంధీ అన్నారు.. మీరు ఏ మార్పు కోరుకుంటున్నారో.. ఆ మార్పు కోసమే వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేయాలి.. అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, భూదందాలు జరుగుతున్నాయని, పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తున్నాయని, మన రాష్ట్రంలో చంద్రబాబు సిఎం అయితేనే దారి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారని, 2024లో టిడిపి అధికారంలోకి వస్తే పెండింగ్ ఉద్యోగాలన్నీ ఐదేళ్లఓ ఏళ్లలో భర్తీ చేస్తామని చెప్పారు.
నేటి లోకేష్‌పాదయాత్ర వివరాలు
మధ్యాహ్నం 2 గంటలకు యర్రబాలెం డాన్ బాస్కో స్క్కూలు వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
2.30 గంటలకు డోలాస్ నగర్‌లో స్థానికులతో మాటామంతి
2.50 గంటలకు ప్రకాష్ నగర్‌లో ఎస్సీలతో సమావేశం
3.10 గంటలకు నుులకపేటలో స్థానికులతో సమావేశం
3.55 గంటలకు సాయిబాబా గుడివద్ద స్థ్థానికులతో మాటామంతి
సాయంత్రం 4.05 గంటలకు సలామ్ సెంటర్‌లో స్థానికులతో సమావేశం
4.25 గంటలకు గేట్ సెంటర్‌లో రెడ్డి సామాజిక తరగతుల వారితో భేటీ
4.40 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్త్రీశక్తి లబ్ధిదారులతో సమావేశం
4.50 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద అగిగ్నికుల క్షత్రియులతో భేటీ
5.05 గంటలకు ఉండవల్లి సెంటర్‌లో ఎస్టీలతో సమావేశం
5.30 గంటలకు ఉండవల్లిలో స్థానికులతో మాటామంతి
రాత్రి 7 గంటలకు చంద్రబాబు నివాసం వద్ద శిబిరంలో బస










