ఒలింపిక్స్ క్రీడలు ఇటీవలే ఘనంగా ముగిశాయి. మన కంటే చిన్న, పెద్ద దేశాలు మెరుగైన ప్రతిభను కనబరచి ఎక్కువ పతకాలు సాధించి సగౌరవంగా స్వదేశాలకు వెళ్లాయి. ప్రపంచంలో జనాభా పరంగా రెండవ పెద్ద దేశం, 140 కోట్ల జనాభాలో 60 శాతం పైబడిన యువత కలిగిన భారత్ కేవలం ఒక్క స్వర్ణంతో మొత్తం 7 పతకాలు సాధించింది. గతం కంటే కాస్త మెరుగే అయినా...ఈ ఫలితాలు, క్రీడాకారుల నైపుణ్యాలు మనల్ని ఆత్మపరిశీలనలో పడేశాయి. కర్తవ్యాన్ని బోధించాయి.
ముఖ్యంగా నేటికీ దేశంలో చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదు. మన విద్యా వ్యవస్థ ఎక్కువగా మార్కులు, ర్యాంకులు, గ్రేడుల చుట్టూ పరిభ్రమిస్తూ ఆటలకు ఆమడ దూరంలో ఉంటోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న పాఠశాలల్లో ఆటస్థలాలు, క్రీడా సౌకర్యాలు, సామగ్రి, వ్యాయామ ఉపాధ్యాయులు లేకుండా, అపార్ట్‌మెంట్లలో ఇరుకు గదుల్లో క్లాసులు నిర్వహిస్తుంటే పతకాలు ఎలా వస్తాయి? రోడ్డు పక్కనే ఉన్న ఇటువంటి కాలేజీలు, పాఠశాలలపై తనిఖీలు ఏవి? చర్యలు ఏవి? అధికారులు, ప్రభుత్వాలు నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఇటువంటి పాఠశాలలపై చర్యలు చేపట్టాలి. అప్పుడే చదువుతో పాటు ఆటల్లో, పాటల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటే అవకాశం వుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా చైనా, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ లాంటి దేశాలు క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, స్టేడియంలు, తర్ఫీదులు, క్రీడా సామాగ్రి ఏర్పాటు చేస్తూ ప్రోత్సహించడం వల్లే స్వర్ణకాంతులు వెదజల్లుతూ ప్రపంచ పటంలో మెరిసిపోతున్నాయి. ఇక మన దేశంలో నిధులు కేటాయింపులు, సౌకర్యాలు లేవు. క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు. అన్నిటికీ మించి, నెదర్లాండ్స్ వలే పైరవీలకు స్వస్తి పలికి, ప్రతిభ ఆధారంగా ఎంపికలు జరగాలి. అప్పుడే మిల్కాసింగ్, ధ్యాన్ చంద్, పి.టి.ఉష, మల్లేశ్వరి, మేరి కోమ్ వంటి వారు వెలుగులోకి వచ్చి, భవిష్యత్తులో బంగారు పతకాలు సాధించి పెడతారు.
'లోథా' కమిటీ సూచనలు అన్ని క్రీడల్లోను అమలు చేయాలి. నిధులు మంజూరే కాదు. ఖర్చు కూడా చేయాలి. క్రీడలకు, క్రీడాకారులకు కార్పొరేట్ రంగు పూయకూడదు. వ్యాపార దృక్పథంతో చూడకూడదు. కాసులు కురిపించే క్రికెట్ వంటి క్రీడలకే మన దేశంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఇతర అథ్లెటిక్స్, ఇన్‌డోర్ గేమ్స్, వ్యక్తిగత అంశాల ఆటలు ఆదరణ తగ్గి, మసకబారుతున్నాయి. అన్ని రకాల క్రీడాకారులకు సముచిత గౌరవం, వేతనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మాజీ క్రీడాకారుల జీవితాలకు భరోసా కల్పించాలి. ప్రభుత్వాలు పలు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుని క్రీడాకారులను, క్రీడలను ప్రోత్సహించడం ద్వారానే భవిష్యత్తులో బంగారు పతకాలతోపాటు, కీర్తి ప్రతిష్టలు పొందగలం.
- ఐ. ప్రసాదరావు, సెల్: 9948272919










