Jul 03,2023 19:31

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్న సిఐ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత స్థానాలను చేరుకుంటారని ఎమ్మిగనూరు రూరల్‌ సిఐ కె.మోహన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో పదో తరగతిలో ప్రతిభ చాటిన గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. మండలంలోని బనవాసి ఎపిఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతిలో సత్తాచాటి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు, గోల్డ్‌ మెడల్‌తో పాటు మెమొంటోలు అందజేశారు. మెరికల్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు కఠోర దీక్ష, నిరంతర సాధనను అలవర్చుకుని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ అరుణ, రూరల్‌ ఎస్‌ఐ నిరంజన్‌ రెడ్డి, పోలీసులు చంద్ర, సుధాకర్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.