Nov 08,2023 22:46

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తగినంత ప్రోత్సాహం ఉంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా మరింత ప్రతిభను ప్రదర్శిస్తారని, ఆ దిశగా అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె .మాధవీలత పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు క్రీడా పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్షా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు కావలసిన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఇటువంటి పిల్లల సంరక్షణ ఎంతో కష్టంతో కూడుకున్నదని, వారి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న, సంరక్షిస్తున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సేవలు అభినందనీయం అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా వచ్చిన వారంతా విజేతలేనని తెలిపారు.కొన్ని చోట్ల ఆధార్‌ నెంబర్‌ సమస్య ఉన్న దివ్యాంగులకు పింఛన్లు రావడం లేదన్న సమస్య ఉందని, అటువంటి వారిని గుర్తించి వివరాలు తెలియచేస్తే వారికి ఆధార్‌ నెంబర్‌ వచ్చే విధంగా తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి వారికి సేవ చేయడంలో కలెక్టర్‌గా తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు. తొలుత చిన్నారులతో జ్యోతి ప్రజ్వలన, ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా పతాక ఆవిష్కరణ అనంతరం పోటీలను జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. జిల్లా సమగ్ర శిక్షా ఐఇ కో ఆర్డినేటర్‌ కనక బాబు మాట్లాడుతూ జిల్లా లోని 19 మండలాల నుంచి దాదాపు 160 మంది ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఉపవిద్యా శాఖాధికారి ఇవిబిఎన్‌ నారాయణ, అర్బన్‌ రేంజ్‌ డిఐబి దిలీప్‌ కుమార్‌, ఎస్‌.కెవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రాజబాబు, సమగ్ర శిక్షా అకౌంట్‌ ఆఫీసర్‌ జె.స్నేహలత, ఐఇఆర్‌పి ఉపాధ్యాయులు చిట్టి, మేరీ రాణి, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.