- దానేటి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక చేయూత
- రూ.20 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు
- 21న వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
- ప్రముఖ వైద్య నిపుణలు దానేటి శ్రీధర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో విద్యావ్యాప్తిలో భాగంగా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు దానేటి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక చేయూత అందించనున్నట్లు ట్రస్టు అధినేత, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ దానేటి శ్రీధర్ వెల్లడించారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన ఎందరో విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని తెలిపారు. కొందరు విద్యార్థులు ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనుకబడుతున్నారని, అటువంటి వారికి అర్హతను బట్టి ఆర్థికసాయం అందించి ప్రోత్సహించేందుకు ట్రస్టు ద్వారా శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇందుకోసం రూ.20 లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అర్హత కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు ప్రముఖ విద్యావేత్తలు విశ్రాంత ప్రొఫెసర్ గుంట తులసీరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ పాలకమండలి సభ్యులు జామి భీమశంకర్, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ పొగిరి సుగుణాకర్, సన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జయరాంతో పాటు తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రతిభ గల విద్యార్థులు ఈ కమిటీని సంప్రదిస్తే ఆ విద్యార్థి అవసరాన్ని, అర్హతను బట్టి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మహ్మద్ రఫీ, ఇటీవల జిల్లాకు చెందిన ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో జయహో పేరిట ఈనెల 21న మోటివేషనల్ ప్రొగ్రాంను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండు నుంచి మూడు వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దానేటి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి ప్రతిభావంతులను చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యావేత్త జామి భీమశంకర్, సుగుణాకర్, సన్ డిగ్రీ కళాశాల అధినేత జయరాం పాల్గొన్నారు.










