- అమరావతి బాలోత్సవం ముగింపు సభలో కలెక్టర్ డిల్లీరావు
- పలు అంశాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రజాశక్తి-వన్‌టౌన్
ప్రతి విద్యార్థికి సృజనాత్మకత అవసరమని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. గత మూడు రోజులుగా వన్‌టౌన్ కొత్తపేటలోని శ్రీ పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం ఐదవ పిల్లల పండుగ ముగింపు సభ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సభకు అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు అధ్యక్షత వహించగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటల్లోనూ రాణించాలన్నారు. గత మూడు రోజులుగా బాలోత్సవం నిర్వహణలో పిల్లలకు సృజనాత్మకతను పెంపొందించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. పిల్లలకు పండుగల విశిష్టతలను తెలియజేప్పే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు లాంటి వాటిల్లో కూడా రాణించాలని విద్యార్థులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని, దాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పూర్వం తాము చదువుకునే రోజుల్లో పాఠశాలల్లో గ్రౌండ్ ఉండేదని, ఆటపాటల్లో పాల్గొనేవారమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో పిల్లల నెత్తిన చదువుల భారం ఎక్కువైందని, చదువుతో పాటు ఉల్లాసంగా ఆటలు, పాటలు, నృత్యాలు, సాంస్కృతికాంశాలలో పిల్లలను తీర్చిదిద్దే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, ఆఫీస్ బేరర్స్ మురళీకృష్ణ, జ్యోత్స్న, గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, కెబిఎన్ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాసరావు, పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.లక్ష్మీనారాయణ, ఎస్‌బిఐ బ్యాంక్ కొత్తపేట మేనేజర్ ఎం.సంతోష్, బాయన వెంకట్రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.










