Nov 17,2023 21:33

ట్రాక్టర్‌కు జిపిఎస్‌ అమర్చుతున్న ఎడి శ్యామసుందర్‌

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ :   ధాన్యం తరలించే ప్రతి వాహనానికీ జిపిఎస్‌ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయ శాఖ ఎడి ఎం.శ్యామసుందర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని అలజంగి, కారాడ గ్రామాల్లో వాహనాలకు జిపిఎస్‌ యంత్రాలను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వ్యవస్థలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సంబంధిత మిల్లుకు చేరవేసే ప్రతి వాహనానికి జిపిఎస్‌ పరికరం ఉండాని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధాన్యం రవాణా కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, వాహనాలకు జిపిఎస్‌ పరికరాలని అమర్చడం తప్పనిసరి అన్నారు. రైతు సొంతఖర్చుతో ఏర్పాటు చేసుకుంటే జిపిఎస్‌ పరికరం ఖరీదు రూ.2,470 అని, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ అమర్చితే రూ.2,920 అవుతుందన్నారు. మండలంలో ఇప్పటివరకు 72 వాహనాలకు జిపిఎస్‌ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. గతేడాది బొబ్బిలి మండలంలో ధాన్యం రవాణా కోసం 396 వాహనాలను ఉపయోగించినట్లు చెప్పారు. మిగతా వాహనదారులు కూడా ఈ పరికరాన్ని అమర్చించుకోవాల్సిందిగా ఆయన కోరారు.