'జనవాణి..జనసేన భరోసా'లో పవన్ కల్యాణ్
24 అర్జీలు స్వీకరణ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, అర్బన్
ప్రతి సమస్య పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని, తన దృష్టికి వచ్చిన సమస్యకు తాను చేయగలిగిన సాయం చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బాధితులకు భరోసానిచ్చారు. వారాహి రెండోవిడత యాత్రలో భాగంగా తొలిరోజు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించగా రెండోరోజు మంగళవారం మినీబైపాస్ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో 'జనవాణి..జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలకు సంబంధించి 24 వినతులు వచ్చాయి. బాధితుల బాధలను పవన్‌కల్యాణ్ ఓపిగ్గా విని సమాధానమిచ్చారు. ఏలూరు పట్టణ పరిధిలో ఫ్లాష్ స్వచ్చంద సంస్థ ద్వారా నిరుపేదల అంతిమ సంస్కారాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, శ్మశానంలో శాంతివనం పేరిట ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని వైకుంఠయాత్ర వాహనం, ఫ్రీజర్లు అక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎకు తమ సంస్థ తగిన గౌరవం ఇవ్వలేదనే నెపంతో నిరుపేదలకు ఉపయోగపడుతున్న శాంతివనాన్ని ధ్వంసం చేసి, ఫ్రీజర్లు బయటికి విసిరేశారని ప్లాష్‌సంస్థ సభ్యులు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో శ్మశానంలో శవ దహనానికి రూ.ఐదు వేల రుసుము పెట్టారన్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న తమ సంస్థ సామగ్రి పెట్టుకోవడానికి స్థలం కేటాయించే ఏర్పాటు చేయాలని కోరారు. 16 ఏళ్లుగా ఆశా వర్కర్లుగా పని చేస్తున్నామని, 2018 తర్వాత ఫిక్స్‌డ్ వేతనమంటూ రూ.6.500 మాత్రమే ఇస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే రూ.3,500 సమాయానికి రావడం లేదని, కనీసం సెలవులు, మెటర్నిటీ లీవులు కూడా లేవని ఆశా వర్కర్లు ప్రమీల, విజయలక్ష్మి వాపోయారు. తమను సచివాలయాలకు అనుసంధానం చేయడంతో సమస్యలు పెరిగాయన్నారు. రవాణా శాఖలో పన్నులతోపాటు వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులకు ఫీజులు చెల్లిస్తున్నా కార్డులు జారీ కావడం లేదని, గత 16 నెలల నుంచి లక్షల సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏలూరు జిల్లా పరిధిలో 50 వేల ఆర్‌సిలు, 30 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు జారీ చేయాల్సి ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సుంకర ఈశ్వర్, చందు కోరారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తమకు తరగతి గదులు లేకపోవడం వల్ల చెట్ల కింద, ఆరు బయటా చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు తమ సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనవాణి కోఆర్డినేటర్ డి.వరప్రసాద్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏలూరు నినయోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.










