Oct 05,2023 00:35

విలేకర్లతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలవనీయకుండా చేసేందుకు సిఎం జగన్‌ రాజకీయంగా కుయుక్తులు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిడిపి ముఖ్య నాయకులందర్నీ ఏదో రూపంలో జైలుకు పంపితే తాను ఒక్కడినే ఎన్నికలు చేసుకోవచ్చునని జగన్‌ ఎత్తుగడ వేస్తున్నారని, వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపిని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ అవినీతి ఉందని, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం జగన్‌తోపాటు పలువురు మంత్రులు, ఇతర నాయకులందరనీ జైలుకు పంపుతామని అన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉన్న ప్రదేశంలోనే జగన్‌ను కూడా ఉంచుతామని, ఇప్పుడు వైసిపికి కొమ్ముకాస్తున్న అధికారులూ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. టిడిపి వస్తే జైలుకు పోతామని తెలిసి ప్రభుత్వంలో ఉన్న రికార్డులు, సాఫ్టువేర్‌ను నాశనం చేసేందుకు కూడా సిఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సలహాదారుల పేరుతో సొంతపార్టీ వారికి, సర్వేల పేరుతో పికె టీమ్‌కు రూ.వందల కోట్ల ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని విమర్శించారు. టిడిపి మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని నియంత్రించేందుకు ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. గొట్టిపాళ్లలో టిడిపి వారిపై వైసిపి వారు దాడి చేస్తే తిరిగి టిడిపి వారిపై కేసులు నమోదు చేశారని, బ్రహ్మారెడ్డిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేశారని, దీనిపై పల్నాడు ఎస్పీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చిలకలూరిపేటలో ఇద్దరు సిఐలను విఆర్‌కు పంపిన అధికారులు పల్నాడులోని వివిధ ప్రాంతాల్లో టిడిపి వారిపై దాడులు ఘటనలలో బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.