ప్రజాశక్తి - ఆస్పరి
ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ ప్రజలకు జవాబుదారీ తనంతో పని చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని కైరుప్పల గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయాన్ని, రూ.20.80 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి జయరామ్ ప్రారంభించారు. గ్రామంలో వాలంటీర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంపిడిఒ రాధను పిలిచి ప్రజలకు సేవలు అందించని 8 మంది వాలంటీర్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు.
గడప ముందుకే సచివాలయ సేవలు
గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరించడానికి సచివాలయ వ్యవస్థ తోడ్పడుతుందని మంత్రి జయరామ్ తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి ఎరువులను రైతు భరోసా కేంద్రంలోనే అందిస్తున్నామని చెప్పారు. రైతులకు పెట్టుబడిగా రైతు భరోసా, పంట నష్టం వస్తే వాటికి పంటల బీమా అందజేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ములుగుందం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం'లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తులు నీటి సమస్య ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి... నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా పూలమాలలు, శాలువాలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, సొసైటీ ఛైర్మన్ కట్టెల గోవర్ధన్, జిల్లా కెడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్‌పిటిసి దొరబాబు, మండల కన్వీనర్ పెద్దయ్య, మండల మాజీ కన్వీనర్ రామాంజనేయులు, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, సర్పంచి తిమ్మక్క, సొసైటీ సిఇఒ అశోక్, నాయకులు బసవరాజు, ప్రభాకర్ రెడ్డి, హనుమంతు, విజరు కుమార్, నరసింహులు, శివ, కౌలుట్లయ్య, లక్ష్మన్న పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి జయరామ్










