ప్రజాశక్తి - కొయ్యలగూడెం
సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్‌ఫేర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశంలోని మానవ వనరులు సంపూర్ణంగా వినియోగంలోకి రావాలంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అధిక సంఖ్యలో శాస్త్రవేత్తలను తయారు చేయొచ్చని చెప్పారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని, దీంతోపాటు ప్రతీ పాఠశాలలో కోటి రూపాయలతో సైన్స్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తే ఎంతోమంది ప్రతిభావంతులను వెలికి తీయొచ్చన్నారు. ల్యాబ్‌లలో వర్కింగ్ మోడల్స్‌తో పనిచేయడం వల్ల మరింత అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. ప్రభుత్వం ఏడాదికి ఒకసారి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రతీపాఠశాలలో ల్యాబ్ ఏర్పాటుపై శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఎన్.ఉమాదేవి, కొనల వరప్రసాద్, ఎంవి.త్రిపురేశ్వరి, ఎస్.కొండలరావు, శివ పాల్గొన్నారు.
టి.నరసాపురం:విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి సైన్స్ ఫేర్‌లు దోహదపడతాయని మక్కినవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ప్రసాద్ తెలిపారు. స్థానిక పాఠశాలలో బుధవారం పాఠశాల స్థాయి సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పాఠశాలస్థాయిలో ఎంపికైన నమూనాలు వచ్చేనెల 12, 13 తేదీల్లో మండల స్థాయిలో ప్రదర్శించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు ఎల్.శరత్ బాబు, బి.వాసు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










