ప్రజాశక్తి- దత్తిరాజేరు : వైసిపి రెండోసారి అధికారంలోకి రావాలంటే గ్రామాలలో ప్రతి కార్యకర్త నుండి ఎంపిపి వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడితేనే విజయం చేకూరుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య హితవు పలికారు. మండలంలో కోమటపల్లి జంక్షన్ వద్ద కళ్యాణ మండపంలో గురువారం మండల పార్టీ అధ్యక్షులు రాపాక కృష్ణార్జున ఆధ్వర్యంలో 'ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే' అనే శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పార్టీ తరపున, ప్రభుత్వం తరఫున రెండు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందులో ముఖ్యంగా మొదటిది జగనన్న సురక్ష కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి వైద్యులతో మేలైన ఉచిత వైద్యం అందించాలన్నారు. రెండవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి 5 గంటల వరకు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేసిన పథకాలపై వివరించాలన్నారు. క్యాడర్ బలోపేతం చేయడం, గ్రామస్థాయి నాయకులు మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దడం, పల్లె నిద్ర చేపట్టడం, వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఇంటింటికి వెళ్లి గతంలో టిడిపి చేపట్టిన పథకాల్లో లోపాలు గూర్చి, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరించి ప్రజల చేతనే మార్కులు వేయించే పని చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇలా ఈ కార్యక్రమాన్ని 45 రోజులపాటు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో 28 వేల ఓట్లు మెజారిటీతో ఎమ్మెల్యేగా బొత్స అప్పల నరసయ్యను గెలిపించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో అంతకుమించి రెట్టింపు మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ఎంపి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపిపిలు బమ్మిడి అప్పలనాయుడు, మిత్తి రెడ్డి రమేష్, బీసీ సెల్ అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు, సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచినీళ్లు ఇవ్వండి సారూ!
గత కొన్నాళ్లుగా తాగడానికి మంచినీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని ఇంగిలాపల్లి గ్రామంలో ఎస్‌టి కాలనీవాసులు గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య వద్ద వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా, జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నప్పటికీ మంచినీటి సమస్య తీరలేదని, అవసరమైన చోట కల్వర్టులు నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగనీరు పేరుకు పోతుందని, కాలనీకి చెందిన పలువురు మహిళలు, యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి బోర్లు పడ లేనందున సమస్య ఏర్పడిందని, తాగునీటి కోసం నిధులు మంజూరు చేసి, మరో రెండు నెలల్లో ఏడంపుల గెడ్డ నుండి తాగునీరందేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, అలాగే కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా తొలిత ఎంపి బెల్లాన చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలు ద్వారా లబ్ధి పొందిన వారితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు, కాసేపట్లో చేరుకున్న ఎమ్మెల్యే అప్పల నరసయ్య, ఎంపితో కలిసి అన్ని వీధులలో పర్యటించి ఇంటింటికి వెళ్లి లబ్ధి పొందిన వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎంపితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.










