Apr 26,2023 20:47

లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని సంతేకుడ్లూరు గ్రామంలో 3వ రోజు 'గడపగడప మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న' నిర్వహించారు. 360 గృహాలను సందర్శించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు నవరత్నాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, వీధి దీపాలు, డ్రెయినేజీ, రోడ్లు సమస్యలపై ఆరా తీస్తూ ప్రతి గడపకు ఎమ్మెల్యే తిరిగారు. సచివాలయం నిధులు రూ.20 లక్షలతో ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ కాలువలు, సిసి రోడ్ల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యేతో పాటు మండల ప్రత్యేకాధికారి పర్యటన
'గడపగడప మన ప్రభుత్వం'లో భాగంగా మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కె.సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేతో పాటు మండల స్థాయి అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. అక్కడ అంగన్వాడీ, సచివాలయం, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు పరిశీలించారు. పాఠశాలల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక మండల కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ మండల అధ్యక్షులు గురునాథ్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, ఎంపిపి అధ్యక్షులు బడాయి దానమ్మ, పంపాపతి, సర్పంచి ధనలక్ష్మి, ఎంపిడిఒ గీతావాణి, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంఇఒ శివరాములు, ఎఒ పాపిరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ నాగ మల్లయ్య, ఇఒఆర్‌డి జనార్ధన్‌, హౌసింగ్‌ బోర్డు అధికారి తిప్పన్న, విఆర్‌ఒ చిన్న ఈరన్న, ఇస్వి ఎస్‌ఐ విజయలక్ష్మి, వైసిపి సీనియర్‌ నాయకులు ప్రతాపరెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.
దళిత కాలనీ సమస్యలు పరిష్కరించండి : కెవిపిఎస్‌
దళిత కాలనీ సమస్యలను పరిష్కరించాలని కెవిపిఎస్‌ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి తిక్కప్ప, నాయకులు మహారాజు, వీరేశ్‌ ఎమ్మెల్యేకు కాలనీ సమస్యలను వివరించారు. దళిత కాలనీలో సిసి రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నాయని, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. దళితులకు ప్రత్యేకంగా శ్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరారు.