కడప ప్రతి ఒక్కరికి ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన ఉండాలని, దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు యదుభూషణ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి శాశ్వత లోక్ అదాలత్ గురించి కలెక్టరేట్‌లో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ ప్రసాద్ మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమని అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ (పిఎల్‌ఏ) ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 'శాశ్వత లోక్ అదాలత్' అనే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా పరిష్కరిస్తుందని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న ఈ వ్యవస్థ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వంచే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాశ్వతలోక్ అదాలకు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని అన్నారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని, దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవలలో ఎలాంటి అవాంతరాలు, లోపాల వల్ల జరిగే నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కారం కాని సమస్యలను శాశ్వత లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా కోర్టు ఆవరణలోని శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు యదుభూషణ రెడ్డి, కార్యాలయపు సిబ్బంది, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.










