ప్రజాశక్తి -అనకాపల్లి : ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి ఆధార్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ప్రతి ఒక్కరికీ ఆధార్ నమోదు చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ఆధార్ నమోదు నిర్వహించాలన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన వారికి బయోమెట్రిక్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి సమన్వయంతో ఆధార్ కార్డులు నమోదు చేయాలని జిఎస్‌డబ్ల్యూఎస్ అధికారిణి మంజులవాణి ఆదేశించారు. అధికార, అనధికార కార్యక్రమాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆధార్ స్టేట్ టీమ్ మెంబర్ గిరిధర్ ఆధార్ నమోదు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ హేమంత్, శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, పోస్టల్ సూపరింటెండెంట్ జె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










