Oct 11,2023 00:55
ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న మోపిదేవి

ప్రజాశక్తి-రేపల్లె: ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి ఒక్కరూ 'సద్వినియోగం చేసుకుని సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించు కోవాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మంగళవారం స్థానిక అయోవా గర్ల్స్‌ హైస్కూల్‌లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. తొలుత క్యాంపులో వైద్యసేవలు పొందుతున్న ప్రజలతో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందచేస్తున్న పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సరైన సమయంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని, విపత్కర సమయాల్లో అప్పటికప్పుడు చేయించుకుంటే కుటుంబ పెద్దను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతి ఇంటికి వైద్య పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి 15 రోజులకు ముందే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారని, అంతేకాక క్యాంపులు ఏర్పాటుపై ఇచ్చిన సైతం ప్రజలకు తెలిపి వారికి ఆరోగ్య సేవలు పొందేలా సహకారం అందించారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జగన్నన ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరు రకాల పరీక్షలతో పాటు కంటి సంబంధిత పరీక్షలు సైతం నిర్వహిస్తారని, సంబంధిత విభాగానికి చెందిన స్పెషలిస్టు వైద్యులను ఈ జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి గ్రామంలో వైద్యసేవలు అందిస్తున్నారని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తొలి ఆరు నెలల కాలంలో ఎన్నికల సమయంలో హామీలను అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వచ్చారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తప్పనిసరిగా అందచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డినే ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కట్టా మంగా, వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ కుమార్‌, విశ్వనాథ గుప్తా, వైసిపి పట్టణ కన్వీనర్‌ గడ్డ రాధాకృష్ణమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ బి విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: మండలంలోని ఓలేరు గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచి మెరుగు రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ డివి లలిత కుమారి జెడ్పిటిసి టి ఉదయభాస్కరి లు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు గ్రామీణ ప్రాంతంలో ఎంతోమందికి ఉపయోగపడుతున్న అన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేపడుతున్నారని, వైద్యశాలలకు వెళ్లలేని అనేకమంది రోగులుకు ఈ శిబిరం ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. వెల్లటూరు పిహెచ్‌సి వైద్యులు సిహెచ్‌ రామలక్ష్మి ఆధ్వర్యంలో మరి కొంతమంది వైద్య నిపుణులతో ఈ శిబిరం నిర్వహించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముందు చూపుతో రోగులకు వైద్యం ఇంటి వద్దకే అందే విధంగా చర్యలు చేపట్టటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖర్‌, మండల తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఎంఈఒలు పులి లాజర్‌, నీలం దేవరాజ్‌, ఈవోపీఆర్డి ఊహారాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.