సిపిఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కూనవరం
పోలవరం ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులవుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని ముల్లూరు గ్రామంలో వెంకమ్మ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు ముందుగా పునరావాసం కల్పించకుండా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కాపర్ డ్యామ్ నిర్మించటం వల్ల ప్రతి ఏటా వరదలు వచ్చి గ్రామాలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్వాసితులందరికీ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ముంపునకు గురవుతున్న అన్ని గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామం నుండి ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 20 నుండి జులై 9 వరకు నెల్లిపాక నుండి విజయవాడ వరకు 18 రోజులు 400 కిలోమీటర్లు, 1000 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాలను కలుపుతూ సాగే ఈ పాదయాత్రకు నిర్వాసితులు అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, నాయకులు పైదా భద్రయ్య, కట్టాం ప్రభాకర్, పొద్దేటి అశోక్, ఎస్.ప్రసాద్, సిహెచ్.రవి తదితరులు పాల్గొన్నారు.










