ప్రజాశక్తి- కె.కోటపాడు
రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి లీలావతి అన్నారు. మండలంలోని గుళ్లేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులు ఆ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించబడిన సోషల్ ఆడిట్ జాబితాను తనిఖీ చేసుకుని అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి వివరించారు. ప్రస్తుతం వరిలో సుడి దోమ ఉందని, దానిని సకాలంలో నివారించుకోవాలని సూచించారు. రెండో పంటకు వేరుశనగ విత్తనాలను సకాలంలో రైతులకు అందించేవిధంగా చర్యలు తీసుకుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు దేముళ్ళు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఎఇఓ లైలాదేవి, సలహా మండలి సభ్యులు, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.










