Jun 27,2021 09:10

విద్యాబాలన్‌ మల్టీటాలెంటెడ్‌ హీరోయిన్‌. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే బాలీవుడ్‌ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. కేవలం గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వలేదు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు. తాజాగా ఆమె నటించిన 'షేర్ని' అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో అనేక అంశాల గురించి ఆమె మాట్లాడారు. అవేంటంటే..

విద్యాబాలన్‌ హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాల్లో నటించారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ 'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'ఎన్టీఆర్‌ మహానాయకుడు'లో బసవతారకం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారామె.

పుట్టిన తేదీ : 1978, జనవరి 1
జన్మస్థలం : ఒట్టపాలం, కేరళ
తల్లిదండ్రులు : పి.ఆర్‌.బాలన్‌, సరస్వతీ బాలన్‌
నటనారంగ ప్రవేశం : సీరియళ్లలో, వాణిజ్య ప్రకటనలలో
నటించిన భాషలు : హిందీ, బెంగాలీ, మళయాళం, తెలుగు
భర్త : సిద్ధార్థరారు కపూర్‌


ఇద్దరూ సమానమే
మహిళలు, పురుషులు ఇద్దరూ సమానమే అని చెప్పేవాళ్లలో ముందుంటారు విద్యాబాలన్‌. ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగ వివక్ష గురించి ఆమె మాట్లాడారు. 'స్త్రీ, పురుషులిద్దరూ సమానమని నేను బలంగా నమ్ముతాను. వంటను ఆడవాళ్లే చేయాలనే రూల్‌ ఏమైనా ఉందా? మహిళలు అంటే వంటగదికే పరిమితమయ్యే వాళ్లు కాదు. మా ఇంటికి అతిథులు వచ్చిన సమయంలో ఒకరు ''నీకు వంట రాదు కదా?'' అని కామెంట్‌ చేశారు. ''నాకే కాదు మా ఆయన సిద్ధార్థ్‌కీ రాదు'' అని చెప్పాను. ''లేదు నువ్వు నేర్చుకుంటేనే బాగుంటుంది'' అని ఆ వ్యక్తి మళ్లీ సలహా ఇచ్చారు. ''సిద్ధార్థ్‌కు నాకూ మధ్య తేడా ఏంటీ?'' అని సమాధానం ఇచ్చేసరికి ఆయన నోరు మెదపలేదు. మా అమ్మ కూడా వంట నేర్చుకోమని గోల పెట్టేది. ''అవసరమైతే వంటమనిషిని పెట్టుకుంటా, లేదంటే వంట వచ్చినవాణ్ని పెళ్లి చేసుకుంటే సరి!'' అని చెప్పేదాన్ని' అంటారు విద్యాబాలన్‌.

ప్రతి మహిళా ఓ పులి!
ప్రతిసారీ గర్జించాల్సిన అవసరం లేదు
'తమ జీవితంలో ఎన్నో సవాళ్లని అధిగమిస్తోన్న మహిళలందరికీ ''షేర్నీ'' చిత్రం ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశంలోని ప్రతి ఇంట్లోనూ ఓ షేర్నీ (ఆడపులి) ఉంది. అయితే చాలా సందర్భాల్లో ఆమె వెలుగులోకి రాలేకపోతుంది. అందుకోసం ప్రతిసారీ గర్జించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు చాలా మార్గాలున్నాయి. ''షేర్నీ''లో నా పాత్ర రిజర్వుడ్‌గా ఉంటూనే బలమైన సంకల్పంతో సాగుతుంది. దాన్ని చూసి మనకి మనం ఎలా ఎదగాలో తెలుసుకోవచ్చు. ''ప్రతి మహిళా ఓ పులి'' అని నేను నమ్ముతా. ఎందుకంటే జీవితమనే అడవిలో ఆమె తన మార్గాన్ని అన్వేషిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకునేందుకు ప్రతి మహిళా అడుగడుగునా ఎన్నో సమస్యలకి లోనవుతుందనే విషయం నాకు తెలుసు. నేను ఎప్పుడూ బలమైన కథల్ని, నిజాయితీగా ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకుంటాను' అంటారు విద్యాబాలన్‌.
తొలి సంపాదన
'ఓ టూరిస్ట్‌ క్యాంపెయిన్‌ కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. నాతో నా సోదరి, మరో కజిన్‌ ఫ్రెండ్‌తో కలిసి టూరిస్ట్‌ క్యాంపెయిన్‌ ఫొటోషూట్‌లో పాల్గన్నాను. ఓ చెట్టు కింద నిలబడి నవ్వుతూ ఉండాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు మాకు ఒక్కొక్కరికీ రూ.500 ఇచ్చారు. అదే నా తొలి సంపాదన. ఆ తర్వాత ''ఏక్తా కపూర్‌ షో హమ్‌ పాంచ్‌'' సీరియల్‌లో రాధికగా 16 ఏళ్ల వయస్సులోనే మొదటిసారి నటిగా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటికీ ఆ రోజులు బాగా గుర్తున్నాయి. ఆ సీరియల్‌ ఆడిషన్స్‌ కోసం మా అమ్మ, సోదరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. రోజంతా అక్కడే వేచి చూశాము. దాదాపు 150 మంది వరకూ ఆడిషన్స్‌కు వచ్చారు. వారందరినీ చూసి మొదట భయం వేసింది. నాకు అవకాశం రాదనుకున్నా. కానీ చివరకు అందులో నటించే ఛాన్స్‌ వచ్చింది' అంటూ చెప్పుకొచ్చారు విద్యాబాలన్‌.
పెద్దగా అవకాశాలు రాలేదు
విద్యాబాలన్‌ ముంబయిలోని ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే నటి అవ్వాలనుకున్న విద్యా షబానా ఆజ్మీ, మాధురీ దీక్షిత్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. 'పరిణీతి' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. 'డర్టీ పిక్చర్‌' విద్యాబాలన్‌ కెరీర్‌లో ప్రత్యేకం అని చెప్పుకోవాలి. విద్యా బాలన్‌ మినహా ఎవరూ ఇంత బాగా నటించలేరేమో ఈ చిత్రంలో అన్నట్లు ఆ సినిమాలో ఆమె ఆకట్టుకున్నారు. ఆ చిత్రానికి విద్యాకు జాతీయ అవార్డు వచ్చింది. విద్యాబాలన్‌ ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్థరారు కపూర్‌ని వివాహం చేసుకున్నారు. ఆమెకు చీర కట్టుకోవడం, పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం.