Oct 27,2023 21:34

ప్రజాశక్తి - నరసాపురం రూరల్‌
నిపుణులైన వైద్యులతో ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందిస్తున్నామన్నాని, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు విజయవంతంగా నడుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని వైఎస్‌.పాలెం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన మెడికల్‌, పౌష్టికాహారం స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీలో ఏయే రోగాలకు వైద్యం పొందొచ్చో ప్రజలకు తెలియజేయాలని ఆరోగ్యమిత్రలకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసాదరాజు మాట్లాడుతూ మరింత మంది వైద్య సేవలు పొందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ శిబిరంలో ఇసిజితోపాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వారికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నారని చెప్పారు. ఇక్కడ నయంకాని రోగాలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీలో చేర్చిన కార్పొరేట్‌ ఆసుపత్రికి పంపి వైద్యం చేయిస్తారన్నారు. ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బొక్కా రాధాకృష్ణ, వైస్‌ ఎంపిపి ఉంగరాల రమేష్‌నాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు దొంగ మురళీకృష్ణ, ప్రజాప్రతినిధులు యర్రంశెట్టి బాబులు, పితాని సత్యనారాయణ, గుబ్బల వెంకటేశ్వరరావు, గుబ్బల రామారావు, గుబ్బల వెంకటేశ్వరరావు, తెలగంశెట్టి వాసు, ఎంపిడిఒ ఎన్‌.శివ ప్రసాద్‌యాదవ్‌, డాక్టర్లు, సచివాలయ సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.