Sep 30,2023 23:43

ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యసేవలు

ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యసేవలు
ప్రజాశక్తి - చిత్తూరుడెస్క్‌: ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యసేవలు అందివ్వాలని ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్‌ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని టెలిఫోన్‌ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు నగరమేయర్‌ అముదలతో కలసి ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ రమ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతి దేవి, డిసిహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, చుడా చైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్‌, రాజేష్‌ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలందరి ఆరోగ్యానికి రక్షణగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకు ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ఉద్దేశ్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, జిల్లాలో 478 క్యాంపులలో ప్రత్యేక వైద్యులను ఏర్పాట్లుచేశామని,11 రకాల వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వైద్యులు వారి సేవలను వ్యాధిగ్రస్తులకు అందించాలనన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచితంగా వైద్యసేవలు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారనన్నారు. చిత్తూరు మేయర్‌ అముద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సంబంధించిన అధికారులు అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహకరించాలని అన్నారు. ప్రత్యేక వైద్యులు డాక్టర్‌ జనార్ధన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతిదేవి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా 32 జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి నుండి నవంబర్‌ 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ మొత్తం 478 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
కమిషనర్‌ అరుణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఏడు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పలువురికీ కంటి అద్దాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రత్యేక అధికారి వీరపాండ్యన్‌, జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అలాగే ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహారం స్టాల్స్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్‌ రవిరాజు, జెడ్పి మహిళా స్థాయి సంఘ ఛైర్‌పర్సన్‌ భారతి, సహాయ కమిషనర్‌ గోవర్ధన్‌, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

'