ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టరు నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. నా నేల - నా దేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం పట్టణంలో బంధం వారి వీధిలో గల సెయింట్ పీటర్స్ పాఠశాల ఆవరణ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీని కలెక్టరు ప్రారంభించారు. ర్యాలీ అనంతరం కలెక్టరు మాట్లాడుతూ నా నేల, నా దేశం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ నిర్వహించామని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిచోటా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశరక్షణలో ప్రాణాలర్పించిన, సేవలందిస్తున్న సైనికులను సన్మానించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఈ దేశం మనకేమిచ్చింది, మాతృదేశానికి మనం ఏమి చేయాలనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని తెలిపారు. దేశానికి జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆంధ్రుడేనని తెలిపారు. దేశభక్తి విషయంలో ఆంధ్రుల ప్రత్యేకమన్నారు. మంగళవారం నిర్వహిస్తున్న స్వాతంత్య్రదినోత్సవవేడుకలలో ప్రజలందరూ పాల్గొనవలసినదిగా కోరారు. ఎమ్మెల్యే ఎ.జోగారావు మాట్లాడుతూ స్వాతంత్య్రదినోత్సవరం సందర్బంగా నా నేల - నా దేశం కార్యక్రమంలో గ్రామగ్రామాన జాతీయజెండాను ఎగురవేసి, దేశభక్తిని చానుకున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. బైక్ ర్యాలీ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఆర్. గోవిందరావు, ప్రోజెక్టు అధికారి సి. విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని వండువ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీ కళావతి ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద నేల తల్లికి నమస్కారం వీరులకు వందనమంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.కల్యాణి, ఎపిఒ జి.సత్యంనాయుడు, రైతు ఉత్పత్తిదార్ల సంఘం అధ్యక్షులు జి.బలరాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
నడిమికల్లలో...
వీరఘట్టం :మండలంలోని నడిమికల్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సర్పంచ్ డి.సుజాత ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నా భూమి నా దేశం స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఎన్.కోటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకి క్విజ్ పోటీలు
మండలంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు తలవరం, బిటివాడ, తెట్టంగి, తదితర పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పలు రకాల క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ఆగస్టు 15 సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
కురుపాం : మండలంలోని బియ్యాలవలసలో నిర్వహించిన నా భూమి నా దేశం కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భముగా గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించి అనంతరం స్వాతంత్ర సమరయోధులకు, పోలీస్ శాఖలో పనిచేసే అమరులైన వారికి, విశ్రాంతి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల గ్రామస్తుల సమక్షంలో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఆవిష్కరించి దీప అలంకరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అజారీ, జడ్పిటిసి జి.సుజాత, పంచాయతీ కార్యదర్శి కె.అనురాధ, జెఇ డిఎస్‌ఆర్‌వి మూర్తి, సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
నా దేశం - నా మట్టిని పరిశీలించిన కమిషనర్
సీతానగరం : మండలంలోని పెదబోగిలి పంచాయతీ పరిధిలో గల అప్పయ్యపేటలో నా దేశం - నా మట్టి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిషనర్ ఎం.అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది త్యాగం చేసిన కుటుంబాలను సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డ్వామా పీడీ పి.రామచంద్రరావు, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్ ప్రసాద్, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురులో ఆజాద్‌కీ అమృత్ మహౌత్సవంలో భాగంగా ''నా భూమి- నా దేశం'' కార్యక్రమం జరిగింది. విద్యార్థులచే ప్రిన్సిపల్ పైల శంకర్రావు ప్రతిజ్ఞ నిర్వహించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రం చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అప్పారావు, సీనియర్ అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, వెంకటేష్, రవిశంకర్ పాల్గొన్నారు.
గరుగుబిల్లి : స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపిడిఒ, తహశీల్దార్, పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాట్లును పూర్తి చేశారు. అలాగే పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఇటీవల విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు.










