ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రతి కార్యాలయం, ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. స్వయంపాలన, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కొత్త శకానికి ప్రతీక అని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గతేడాది నిర్వహించిన హర్ ఘర్ తిరంగా విజయవంతమైన నేపథ్యంలో హర్ ఘర్ తిరంగ 2.0 కార్యక్రమాన్ని ఈ ఏడాదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ జెండాలను చెల్లింపు ప్రాతిపదికన పౌరులకు పంపిణీ చేసే బాధ్యతను తపాలా శాఖ చేపట్టిందని పేర్కొన్నారు. జాతీయ జెండా ప్రతి పోస్టాఫీసులో రూ.25కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోస్టాఫీసుల్లో పది వేల జెండాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసుల నుంచి జాతీయ జెండాలను కొనుగోలు చేసి ఇళ్లపై ఎగురవేయాలని కోరారు.










