ప్రజాశక్తి-గుంటూరు : జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవల దరఖాస్తులను సక్రమంగా సేకరించి, నిర్దేశిత సమయంలోగా పరిష్కరించేలా మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సబ్ కలెక్టర్, ఆర్డిఓ, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలక్టరేట్ నుండి కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారితో కలసి బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జగనన్న సురక్ష క్యాంప్ డేకు వారం ముందు నుంచే సంబంధిత సచివాలయ పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవల దరఖాస్తులను సేకరించి యాప్‌లో టోకెన్లు జనరేట్ చేసేలా క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పేదలందరికి ఇళ్ల పథకం లే ఔట్లలో జూలై 31 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు కచ్చితంగా అధిగమించాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించేలా విద్యుత్ శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్‌ఔట్స్ అయిన పిల్లలను తిరిగి పాఠాశాలల్లో చేర్పించేందుకు ఎంఇఒలతో పాటు, ఎంపిడిఒలు, ప్రత్యేక అధికారులు, ఎడ్యుకేషన్ సెక్రెటరీలను, వాలంటీర్లను సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024కు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం డోర్ టు డోర్ ఓటరు కార్డుల వెరిఫికేషన్ సక్రమంగా జరిగేలా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు బిఎల్‌ఓలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ కింద జాబ్‌కార్డ్ పొందిన విభిన్న ప్రతిభావంతులకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా పని కల్పించాలన్నారు. జేసీ మాట్లాడుతూ గుర్తించిన కౌలు రైతులందరికీ సిసిఆర్‌సి కార్డులను జగనన్న సురక్ష కార్యక్రమంలో పంపిణీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకట శివరామిరెడ్డి , జెడ్పీ సిఈఓ జె.మోహన్‌రావు, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










