
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస, పొందూరు: ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలంలో చింతలపేట, దండేవలస, బొబ్బిలిపేటలో పొందూరు మండలం ధర్మపురం, పిల్లలవలసలో జల జీవన్ మిషన్ పథకం కింద మంచినీటి కుళాయిల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. బొబ్బిలిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నదీ, లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నారని అన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. గత టిడిపి ప్రభుత్వం వలె జన్మభూమి కమిటీలు లేవని దళారులు అంతకంటే లేరన్నారు. నేరుగా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పొందూరు జెడ్‌పిటిసి ఎల్.కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, కె.రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్ కుమార్, ఎంపిడిఒ ఎస్.వాసుదేవరావు, మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ చంద్రమౌళి, సర్పంచ్ మొదలవలస పాపారావు, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్, జి.నాగరాజు, జెసిఎస్ బాడాన వెంకట కృష్ణారావు, వైస్ ఎంపిపి ప్రతినిధి వండాన సూరపనాయుడు తదితరులు పాల్గొన్నారు.