- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - బూర్జ: జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని హరిపురంలో సుమారు రూ.ఏడు లక్షలు, తుడ్డలిలో సుమారు రూ.41 లక్షలు, డొంకలపర్తిలో సుమారు రూ.55 లక్షల నిధులతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిల పథకానికి స్పీకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. డొంకలపర్తిలో సుమారు రూ.ఐదు లక్షలతో మినీ వాటర్ ప్లాంట్‌ను, ఫిష్ ఆంధ్రలో భాగంగా రాయితీపై అందిస్తున్న మినీ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు. కలుషితమైన నీటిని తాగడం ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛమైన గాలి ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన నీరు అంత అవసరమన్నారు. నీటి లభ్యత, వినియోగంపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బి.రామారావు, ఎంపిపి ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, టిడ్కో డైరెక్టర్ ఖండాపు గోవిందరావు, వైస్ ఎంపిపిలు బూడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










