తాను ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం ఆంక్ష విధించినా ... కేరళ వామపక్ష ప్రభుత్వం రూ.1000 బోనస్ ఇచ్చి క్వింటాల్ రూ.2668కు ధాన్యం సేకరిస్తున్నది. కేరళ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం న్యాయమైన ధర చెల్లిస్తుండగా బిజెపి, వైసిపి తదితర ప్రభుత్వాలు రైతుకు ఎందుకు ఇవ్వలేవు ? రైతులు పాలకులను ఈ ప్రశ్న అడగాలి.
ధాన్యం తయారై ఇరవై ఐదు రోజులు దాటింది. అంతకు ముందే తమ ప్రభుత్వం ప్రతి గింజా కొంటుందని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ప్రకటన చేసేశారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మాత్రం కొనడం లేదు. కొనకుండానే కొంటున్నట్లు రికార్డులు సృష్టించారు.
కొన్ని చోట్ల (ఉదాహరణకు దుగ్గిరాలలో) 75 కిలోలు రూ.1000కు కొంటున్నారు. అంటే కిలోకి రూ.13.33 మాత్రమే చెల్లిస్తున్నారు. కనీస మద్దతు ధర ప్రకారం కిలోకి రూ.16.68 చెల్లించాలి. ఈ లెక్కన 100 కిలోల్లో రూ.335 నష్టపోతున్నారు. రైతును ఎంతలా దోచేస్తున్నారో చూడండి. అదే రైతు సంఘాలు, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు గట్టిగా పోరాడిన చోట ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా అంటిపేటలో రైతు సంఘం పోరాటంతో ప్రభుత్వ అధికారి, మండల తహశీల్దార్ కదిలి వచ్చి కింటాల్ రూ.16.68కి కొనిపించక తప్పలేదు. ప్రభుత్వ మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వున్నాయి గనుక పోరాడి అమలు చేయించగలుగుతున్నాం. రేపు మోడీ వ్యవసాయ చట్టాలు అమలు లోకి వస్తే కనీస మద్దతు ధర వుండదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వుండవు. అపుడు రైతును వ్యాపారులు బతకనిస్తారా?
మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం దిబ్బలు
కొనుగోలు కేంద్రాల్లో కొనకపోయినా రైస్ మిల్లుల్లో ధాన్యం బస్తాల దిబ్బలు వున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతుకు వేరే మార్గం కనిపించక ఎంతో కొంతకు దళారులకు అమ్ముకుంటున్నారు. దారుణంగా నష్టపోతున్నారు. ఈ దళారులు బియ్యం మిల్లుల మనుషులే. దళారుల ద్వారా తక్కువకు కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొన్నట్లు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి కనీస మద్దతు ధర కొట్టేసి రైతుకు తక్కువ ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతును దోచేస్తున్నారు. ఇటు రైతును, అటు ప్రభుత్వాన్ని మోసం చేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారు.
వ్యవసాయ చట్టాలు రైతును బతకనిస్తాయా ?
రైతు కొద్ది రోజులు కూడా పంటను నిలబెట్టుకోవడానికి అవకాశం లేక, ధర వచ్చేంత వరకు ఆగలేక ఎంతో కొంతకు అమ్ముకోవడం వాస్తవం. కాగా రైతు ఎంతైనా నిల్వ చేసుకుని, ఎక్కడైనా, ఎంతకైనా అమ్ముకోవచ్చని మోడీ చేసిన చట్టం రైతుకు ఉపయోగపడుతుందా? రైతులు ఎవరికైనా, ఎక్కడైనా, ఎంతకైనా అమ్ముకునే విధంగా చట్టం చేసి...ప్రభుత్వ ఆంక్షల నుండి రైతును విముక్తి చేశానని మోడీ అనడం ఎంత ఫార్సో ధాన్యం మార్కెట్‌ను పరిశీలిస్తే తేలిగ్గా అర్ధమైపోతుంది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక రైతుకు న్యాయమైన ధర రావడం లేదు. మద్దతు ధరే లేకపోతే రైతును వ్యాపారులు బతకనిస్తారా? మోడీ చేసిన వ్యవసాయ చట్టాలు రైతును ఉరేయవా?
చెప్పిందొకటి చేసేది మరొకటి
స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతు పంటపై పెట్టిన పెట్టుబడికి రైతు కుటుంబ శ్రమ, మరో 50 శాతం కలిపి ఆ మొత్తం రైతుకు దక్కేలా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ధర వచ్చేంత వరకు రైతు పంట నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు, గోదాములు నిర్మించి రైతుకు అందుబాటులో వుంచాలని చెప్పింది. ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థను విస్తృతపర్చాలని చెప్పింది. రైతుకు ప్రభుత్వం పెట్టుబడి సదుపాయం కల్పించాలని చెప్పింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తానని మోడీ రైతుకు వాగ్దానం చేసి గద్దెనెక్కారు. ఇపుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవసాయ చట్టాలు చేసి రైతును కార్పొరేట్ రాబందులకు ఆహారం చేస్తున్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం నిర్ణయిస్తే ధాన్యానికి క్వింటాలుకు రూ.2668 కనీస మద్దతు ధర చెల్లించాలి. కానీ మోడీ ప్రభుత్వం క్వింటాలుకు రూ.1868 మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటించింది. అంటే ఒక క్వింటాలుకు రూ.1000 తగ్గించి రైతుకు ద్రోహం చేసింది. తాను ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం ఆంక్ష విధించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కూడా కొనకుండా రైతును మరింత నష్టానికి గురిచేస్తున్నది. మోడీ, జగన్ చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమైపోయిందో మరి.
ఎమ్మెల్యేలు, ఎంపీ లే రైస్ మిల్లర్లు
తాను ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం ఆంక్ష విధించినా...కేరళ వామపక్ష ప్రభుత్వం రూ.1000 బోనస్ ఇచ్చి క్వింటాల్ రూ.2668కు ధాన్యం సేకరిస్తున్నది. కేరళ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం న్యాయమైన ధర చెల్లిస్తుండగా బిజెపి, వైసిపి తదితర ప్రభుత్వాలు రైతుకు ఎందుకు ఇవ్వలేవు? రైతులు పాలకులను ఈ ప్రశ్న అడగాలి. బిజెపి, వైసిపి, టిడిపి తదితర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎం.పి లు, మంత్రుల్లో ఏదో కొద్ది మంది మినహా అందరూ రైస్ మిల్లర్లే. లేదా వారి బంధు మిత్రులే మిల్లర్లు. అందువలనే ప్రతి చిల్లర విషయంపై రోజూ గంటలు గంటలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే చంద్రబాబు ఎందుకు ధాన్యం సేకరించడం లేదని ప్రశ్నించడం లేదు. మిల్లర్లలో టిడిపి కి చెందిన నాయకులు ఉండడమే అసలు రహస్యం. అదే సిపిఎం, వామపక్ష పార్టీల్లో రైస్ మిల్లర్లు ఎమ్మెల్యే, ఎంపీలుగా లేరు. కేరళలో రైతుకు న్యాయం జరగడానికి, ఇక్కడ రైతుకు ద్రోహం జరగడానికి అది కూడా ఒక కారణం.
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై ఒత్తిడి
ఇపుడు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రాష్ట్రంలో రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు వున్న చోట పోరాడి అమలు చేయిస్తున్నాయి. అవి లేని చోట మిల్లర్ల ఇష్టారాజ్యం సాగుతున్నది. మోడీ మూడు వ్యవసాయ చట్టాలు అమలు చేస్తే ఇక రైతు, రైతు సంఘం, వామపక్ష పార్టీలు అడిగేదానికి కూడా లేదు. వ్యవసాయం, వ్యవసాయ మార్కెట్...దేశ విదేశీ కార్పొరేట్ల పరం చేయాలంటే...రైతును సర్వనాశనం చేయాలి. అదే బిజెపి మూడు వ్యవసాయ చట్టాల లక్ష్యం. అందుకు టిడిపి, వైసిపి పార్టీల మద్దతు ఇవ్వడం మహా దారుణం. మోడీ చట్టాలను నోటితో చెప్పకుండా జగన్ మోహన్ రెడ్డి ఆచరిస్తున్నారు. అందువలనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు నటిస్తున్నారు తప్ప ధాన్యం కొనడం లేదు. రైతులు ఎక్కడికక్కడ ఐక్యమై ధాన్యం కొంటావా? లేదా? అని జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొనిపించాలి.
పోరాడి రైతుగా మిగలాలి
మరో వైపు మోడీ వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీలో వీరోచితంగా పోరాడుతున్న రైతులతో కలిసి పోరాడి రైతుగా మిగలడమా? లేక పోరాడకుండా వ్యాపారుల వలలో చిక్కి గిలగిలా కొట్టుకు చావడమా? ఈ రెండే మార్గాలు రైతు ముందు ఉన్నాయి. మోడీ వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టి రైతుగా గౌరవంగా జీవించడం ఉత్తమ మార్గం. ఢిల్లీలో పోరాడుతున్న రైతులతో కలిసి ఉద్యమించడమే సరైన మార్గం. రైతులు తొలి విజయం సాధించారు. విద్యుత్ చట్టంలో సవరణలకు మోడీ ప్రభుత్వం దిగి వచ్చింది. దేశమంతా రైతుల పోరాటానికి మద్దతు వస్తున్నందున మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పదు.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
ఎం.కృష్ణమూర్తి











