Aug 29,2023 23:10

సమగ్ర భూ సర్వే పత్రాలను అందజేస్తున్న స్పీకర్‌ తమ్మినేని

* శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - బూర్జ: 
ప్రతి గడపకు తాగునీరు అందిస్తామని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కొల్లివలసలో సుమారు రూ.68 లక్షలు, సంకురాదలో సుమారు రూ.24 లక్షలు, నీలాదేవిపురంలో సుమారు రూ.74 లక్షలతో జల జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికీ కుళాయి కార్యక్రమానికి స్పీకర్‌ సీతారాం మంగళవారం శంకుస్థాపన చేశారు. బూర్జలో రూ.36.34 లక్షలతో అంతర్గత కాలువలకు శంకుస్థాపన చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులకు స్పీకర్‌ చేతుల మీదుగా కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. బూర్జ, శంఖురాడలో సమగ్ర భూ సర్వే పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి జల జీవన్‌ మిషన్‌ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, ఎంపిపి కె.దీప, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, టిడ్కో డైరెక్టర్‌ ఖండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, డిసిసిబి డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు, సర్పంచ్‌లు జీడి వేణు, జల్లు ఆదినారాయణ, అనురాధ, వైస్‌ సర్పంచ్‌ తొత్తడి కృష్ణ, ఎంపిటిసి మజ్జి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.