Nov 03,2023 20:39

జెసికి వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలో ప్రతి ఎకరాకూ సాగునీరిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్‌, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి, సిఐటియు మండల కార్యదర్శి అశోక్‌, సీనియర్‌ నాయకులు శ్రీరాములు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మండల రైతులు కరువును ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. హంద్రీనీవా నుంచి మండలంలోని ప్రతి ఎకరాకూ సాగునీరిచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందనలో జెసి నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హంద్రీనీవాకు గుండ్లకొండ దగ్గర స్లూయిస్‌ ఏర్పాటు చేస్తే గుండ్లకొండ నుంచి కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వచ్చని తెలిపారు. దశాబ్దం గడుస్తున్న హంద్రీ నీవా పనులు పెండింగ్‌లో ఉన్నాయని, రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని చెప్పారు. హంద్రీనీవా పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. హంద్రీనీవాకు పంట కాలువల నిర్మాణం పూర్తి చేసి 46 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండలంలో కోటకొండ, బేతపల్లి మధ్య అధ్వానమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. దేవనకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిని పెంచి 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. కోటకొండలో పిహెచ్‌సి ఏర్పాటు చేయాలని, మండలంలో మోడల్‌ స్కూల్‌, డిఎన్‌టి హాస్టల్‌ పునరుద్ధరణ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని, తెర్నేకల్‌, కోటకొండలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవనకొండ, తెర్నేకల్‌, కుంకనూరు శ్మశాన వాటికల సమస్యను పరిష్కరించాలని, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు యూసుఫ్‌, నాగేష్‌, శ్రీనివాసులు, రసూల్‌, వీరేంద్ర, నాగరాజు, రాయుడు, నాగేంద్ర, మహేంద్ర, రైతులు జయచంద్ర, శ్రీనివాసులు, కృష్ణ, మార్కండేయులు పాల్గొన్నారు.