Aug 06,2022 23:44

ర్యాలీలో పాల్గొన్న హరిహరనాథశర్మ తదితరులు

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : ప్రతి దేశానికీ ఒక జెండా, అలాగే అజెండా ఉంటాయని, భారతదేశం జెండా త్రివర్ణ పతాకం, అజెండా రాజ్యాంగం అని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు అవధానం హరిహరనాథ శర్మ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ''హర్‌ గర్‌ తిరంగా'' ర్యాలీని శనివారం ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుంచి రెడ్నం గార్డెన్‌ స్టేట్‌ బ్యాంక్‌ వరకు, తిరిగి జిల్లా కోర్టు వరకు సాగింది. జెండా కోడ్‌ ప్రకారం ఆగస్టు 15 వరకు అందరూ జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. స్వాతంత్య్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుని, వారి ఆశయాల సాధనకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి.బులికృష్ణ, ప్యానల్‌ లాయర్లు లక్ష్మీరాంబాబు, బగాది తులసీదాసు, నాగభూషణం, నాగకుమారి, పారా లీగల్‌ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎంవిపి లా కాలేజ్‌ డీన్‌ సాయి సుధ, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.