Nov 14,2021 13:04

టీనేజీ కుర్రాళ్లంటే ఎలా ఉంటారు? చదువు, ఆటపాటలు తప్ప మరే విషయాల మీదా శ్రద్ధ చూపరనేది ఎక్కువమంది భావన. కానీ మనం చెప్పుకోబోయే ఈ కుర్రాడు అందుకు పూర్తి భిన్నం. టీనేజీలోకి అడుగుపెట్టగానే ఆ గ్రామంలో ఐదు మద్యం దుకాణాలు మూసేయించడానికి కారణమయ్యాడు. వందలాది బాల కార్మికులు బడిబాట పట్టడానికి కృషి చేస్తున్నాడు ఈ యువకుడు. కరోనా కష్టకాలంలోనూ గ్రామస్తులకు భరోసా ఇచ్చాడు. ఈ మధ్యే ఎంతో ప్రతిష్టాత్మకమైన 'డయానా అవార్డు 2020'ని అందుకున్నాడు. అతనే మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల సూర్జిత్‌ లోధి. ఇంత చిన్న వయస్సులోనే ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం..

   మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మద్యపానం, బాల కార్మికులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు సూర్జిత్‌ లోధికి కేవలం 13 ఏళ్లు మాత్రమే. ఐదు మద్యం దుకాణాలను మూసివేసి, వందమందికి పైగా పిల్లల్ని పాఠశాలలో చేర్చేందుకు సూర్జిత్‌ చేసిన అద్భుతమైన కృషి ఇటీవలే గ్లోబల్‌ ఫోరమ్‌లో గుర్తింపు పొందింది. ఈ మధ్య కాలంలోనే వర్చువల్‌ వేడుకల ద్వారా 'డయానా అవార్డ్‌ 2020'ని అందుకున్నాడు.
సూర్జిత్‌ లోధి వాళ్లది పది మంది ఉన్న ఉమ్మడి కుటుంబం. అందరూ వ్యవసాయం, కూలీ పనులు చేసేవారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఆర్థికంగా అంతంతమాత్రం. దాంతో అతను చిన్నప్పుడే తండ్రి మద్యానికి బానిసయ్యాడు. తండ్రి బాగా తాగి, భార్యాబిడ్డలను హింసించేవాడు. పైగా సూర్జిత్‌ను చిన్న వయస్సులోనే చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టి, డబ్బు సంపాదించమన్నాడు తండ్రి. కానీ ఆ సమయంలోనే సూర్జిత్‌ లోధి తాత కుటుంబ బాధ్యత తీసుకుని, అతన్ని చదివించడానికి ముందుకొచ్చాడు.

ప్రతి బిడ్డా చదువుకునేలా చూస్తా..!


 

                                                  బెదిరించినా బెదర్లేదు

'బాల కార్మికులను అంతం చేసేందుకు 1960లో భారతదేశం అంతటా కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ (ఖూజఖీ) ప్రారంభించిన బాలమిత్ర గ్రామ్‌ (దీవీ+) కార్యక్రమంలో 2016 లో చేరాను. ఈ సంస్థ బాల కార్మికులను బడిబాట పట్టించడంలో కృషి చేస్తూ ఉంటుంది. వారిచ్చిన ధైర్యంతో నా కష్టాలతోపాటు మరెందరో పిల్లల కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నా. గృహహింస ఎలా ఉంటుందో ఒకరు నాకు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నేనూ బాధితుడినే. మా గ్రామంలో మద్యం దుకాణాలు ఉన్నాయి. అవి మూసేస్తేగానీ మా జీవితాల్లో మార్పు రాదని గుర్తించా. కానీ 14 ఏళ్ల పిల్లవాడి మాటలు పెద్దలు వినరని తెలుసు. అందుకే మొదట్లో దాదాపు 90 మంది పిల్లలను సంప్రదించాను. మద్యపానం ప్రభావం కుటుంబాల మీద ఎలా పడుతుందో వారికి అవగాహన కల్పించాను. తర్వాత నా నాయకత్వంలో ఎన్నో ర్యాలీలు నిర్వహించా. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించి, ఎన్నో పిర్యాదులు చేశా. దుకాణ యజమానులు ఎన్నోసార్లు నన్ను బెదిరించారు. అయినా నేను బెదర్లేదు. పోలీసులను ఆశ్రయించాను. అలా రెండేళ్లు నిర్విరామంగా కృషి చేస్తే 2019లో ఐదు దుకాణాలు మూతపడ్డాయి. నేడు మా గ్రామంలో గృహహింస, పిల్లలపై హింస జరగకుండా నిఘా కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. మద్యం దుకాణాలు మూసేసిన యజమానులు జీవనోపాధిని కోల్పోతారని నాకు తెలుసు. అందుకే ప్రభుత్వ అధికారుల సహాయంతో దినసరి కూలీలుగా వారికి ఉపాధి కల్పిస్తున్నాం' అంటున్నాడు సూర్జిత్‌ లోధి.

ప్రతి బిడ్డా చదువుకునేలా చూస్తా..!


 

                                                    బాధ్యత పెరిగింది

ప్రతి బిడ్డా చదువుకునేలా చూస్తా..!

'ప్రతిష్టాత్మకమైన డయానా అవార్డు నాకు రావడం సంతోషంగా ఉంది. ఇది నా దేశ పిల్లలపట్ల నా జవాబుదారీతనం.. నా బాధ్యత మరింత పెంచింది. ఇకపైనా బాల కార్మికులు బడిబాట పట్టడానికి మరింతగా కృషి చేస్తా. మద్యం సేవించడం వల్ల కుటుంబాలు ఎంత నష్టపోతాయో తెలిపే అవగాహనా సదస్సులను నిర్వహిస్తా!' అంటున్నాడు సూర్జిత్‌ లోధి.
'మా BMG లో చాలామంది పిల్లలకు సూర్జిత్‌ లోధి ఒక రోల్‌ మోడల్‌. ఇక్కడ ప్రతి బిడ్డా బలమైన నాయకుడు. వారి హక్కులను నొక్కి చెప్పడానికి, పెద్దలతో కలిసి వారి గ్రామాభివృద్ధి కోసం పోరాడటానికి అధికారం కలిగి ఉన్నారు' అని BMG ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ప్రోగ్రామ్స్‌) పి నాగసాయి మాలతి చెప్పారు.
మార్చి 2020 లాక్‌డైన్‌ సమయంలోనూ కోవిడ్‌- 19 ఆ ప్రాంతంలో వ్యాప్తి చెందకుండా, వ్యాక్సినేషన్‌పై అనేక అవగాహన సదస్సులు జరిపాడు సూర్జిత్‌ లోధి. ప్రస్తుతం అతను 11వ తరగతి చదువుతున్నాడు. వీదీదీూ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ చేయాలనే ఆశతో ఉన్నాడు. జాతీయ స్థాయిలో తన కార్యక్రమాలను పెంచి, ప్రతి బిడ్డా చదువుకునేలా సహాయం చేయడమే తన అంతిమ లక్ష్యం అని చెబుతున్నాడు సూర్జిత్‌ లోధి. అతని ఆకాంక్షలన్నీ నెరవేరాలని మనమూ కోరుకుందాం. ఆల్‌ ది బెస్ట్‌ సూర్జిత్‌ లోధి.