ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో కొంతమంది వైద్యులు కాసులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణల రోగుల నుంచి ఇటీవల ఎక్కువయ్యాయి. డబ్బులిస్తేనే ప్రసవం కోసం వెళుతున్న గర్భిణిలకు సీజేరియన్ చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని పలువురు బాధితులు వైద్యుల గుట్టు బయటపెడుతున్నారు. ఈ ఆస్పత్రిలో నెలకు 20 నుంచి 30 వరకూ సిజేరియన్లు జరుగుతుండగా ఒక్కో సిజేరియన్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెటర్నటీ వార్డులో కొందరు సిబ్బంది ద్వారా వైద్యులు యథేచ్ఛగా సొమ్ములు దండుకుంటూ జేబులు నింపుకోవడం శోచనీయమని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసే ముందే సిబ్బంది డబ్బులు అడుగుతుండగా వైద్యం విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న అనుమానంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి వారికి ముట్టజెపుతున్నామని రోగుల బంధువులు వివరించారు. ఆస్పత్రిలోని ప్రధాన వైద్యులపైనే ఎక్కువగా పైసా వసూల్ ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆస్పత్రిని తనిఖీ చేసి ఒక వైద్యురాలిని సస్పెండ్ చేసినా డాక్టర్ల పద్ధతి మారలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ అదే వైద్యులపై ఇప్పుడు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో కాన్పు కోసం ఒక గర్భిణి రాగా ఆమె ఆడ బిడ్డను పూరిట్లోనే వైద్యులు అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిఠాపురం పట్టణం రథాల పేటకు చెందిన బాధిత మహిళ దాసరి లక్ష్మి జిల్లా కలక్టరేట్ స్పందనలో ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతం అయింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. నిత్యం గర్భిణిల వద్ద పైసలు వసూలు చేస్తూ లక్షలు వెనుక వేసుకుంటున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యహహారాలు జిల్లా ఆరోగ్య సేవల అధికారులకు తెలిసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
భారీగా పర్సంటేజీలు
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కషి చేయాల్సిన వైద్యులు కాసులకు కక్కుర్తి పడి పేదల జేబులను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వస్తున్న గర్భిణులను బయట ప్రయివేటు స్కానింగ్ కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా తరచూ స్కానింగులు, వివిధ పరీక్షలు చేయిస్తూ భారీగా పర్సంటేజీలు దండుకుంటున్నారని వైద్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏదీ సమయ పాలన
మరోవైపు రెగ్యులర్ వైద్యులు సమయపాలన సక్రమంగా పాటించడం లేదని ఆస్పత్రి సిబ్బందే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రిలో విధులకు హాజరు కావాల్సి ఉన్నా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ముఖం చూపించి మరలా మధ్యాహ్నం 1 గంట లోపు ఇళ్లకు వెళుతున్నారని రోగులు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే కనీసం ప్రాథమిక వైద్య సేవలు అందిచకుండానే కాకినాడ జిజిహెచ్‌కు రిఫర్ చేస్తున్నారని పలువురు వివరించారు. ట్రైనింగ్ డాక్టర్లు మాత్రమే రాత్రిళ్లు సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు.










