Apr 28,2023 19:37

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి రామ గిడ్డయ్య

ప్రజాశక్తి - ఆదోని
గర్భిణులను ప్రసవానికి ముందే ఆస్పత్రిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి రామగిడ్డయ్య ఎఎన్‌ఎంలను, హెల్త్‌ సూపర్‌వైజర్లను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ హాలు ఆవరణలో డివిజన్‌లోని ఎఎన్‌ఎంలు, హెల్త్‌ సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనీమియా మానిటరింగ్‌ టూల్స్‌ యాప్‌లో గర్భిణులు, కిషోర బాలికలకు నిర్వహించిన రక్త పరీక్షల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని ఫాలో అప్‌ చేస్తూ వారికి మెడిసిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 0-5 ఏళ్లలోపు పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండేలా చూడాలని తెలిపారు. బరువు తక్కువ ఉన్న పిల్లలకు పోషకాహార పదార్థాలు అందేలా చూడాలని సదస్సుకు హాజరైన సిబ్బందిని ఆదేశించారు. బీపీ, మధుమేహం, రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా మందుల అందజేయాలన్నారు. ఒకవేళ సమస్య తీవ్రమైతే వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి, జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, డిపిఎంఒ డాక్టర్‌ ఉమా, ఆర్‌బిఎస్‌కె జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత, ఫ్యామిలీ ఫిజీషియన్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బాల మురళీ, డిపిఒ విజయరాజు, ఎస్‌ఒ హేమ సుందరం, డెమో శ్రీనివాసులు పాల్గొన్నారు.