Aug 22,2023 15:38

ప్రజాశక్తి - గణపవరం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే డెలివరీ కేసులు జరగాలని, సుఖ ప్రసవాలు జరిపి లక్ష్య సాధనకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం గణపవరం పిహెచ్‌సిని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా 20 ప్రసవాలు జరగాలని, ఈ నెలలో ఎందుకు తక్కువ జరిగాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల సేవలందించాలని చెప్పారు. ప్రసవాల సంఖ్య పెరగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది పూర్తిగా ఉన్నా ఎందుకు టార్గెట్‌ పూర్తి చేయలేకపోతున్నారని వైద్యాధికారులను ప్రశ్నించారు. ఈ నెలలో టార్గెట్‌ అధిగమించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రహదారి పక్కన ఉన్న పిహెచ్‌సికి ఒపిలు ఎంత మంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. పిహెచ్‌సి అభివృద్ధికి నిధులు కొరత లేదన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డి. మహేశ్వరరావు, తహశీల్దార్‌ పి.లక్ష్మి, విఒ పిఆర్‌డి టివి సత్యనారాయణ, ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ పి.సంతోషనాయుడు పాల్గొన్నారు.