ప్రస్తుత పంటలకే నీరిచ్చే అవకాశం
- కొత్తగా వేసే పంటలకు అనుమానమే..
- వర్షాలు కురిస్తేనే పూర్తి స్థాయిలో...
- 14న జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం
- నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకే నీళ్లు ఇస్తారా లేక ఇప్పుడు వేసుకోబోతున్న పంటలకు కూడా నీళ్లు ఇస్తారా అన్నది రెండు రోజుల్లో తేలనున్నది. ఈ నెల 14వ నీటి పారుదల సలహా మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా తెలుగు గంగ కింద 80 వేల ఎకరాలు, ఎస్‌ఆర్‌బిసి కింద 70 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు రైతులు సాగు చేశారు. ఈ పంటలకు ప్రస్తుతం ఉన్న నీటిని వారబందీ ప్రకారం ఇస్తేనే పంటలను కాపాడుకోగలమని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ గా నీళ్లు ఇస్తే ప్రస్తుతం ప్రాజెక్ట్‌లలో ఉన్న నీరు సరిపోదని చెబుతున్నారు. ఆగస్ట్ 11 నాటికి శ్రీశైలంలో 123 టిఎంసిల నీరు ఉండగా ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు నిరీచ్చేందుకు 45 టిఎంసిల నీటిని వాడుకున్నారు. దీంతో 85 టిఎంసిలకు నీటి నిల్వలు పడిపోయాయి. అయితే ఇటీవల కురిసిన వర్షంతో మళ్లీ శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 7 టిఎంసిల నీరు వచ్చి చేరింది. దీంతో 92 టిఎంసిలకు పెరిగింది. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌లో 7.3 టిఎంసిల నీటి నిల్వ ఉండగా మరో.5 టిఎంసిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గోరుకల్లులో 8 టిఎంసిలు, అవుకు రిజర్వాయర్ 1 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌బిసికి, వెలుగోడు నుండి తెలుగు గంగ కింద సాగు చేసుకున్న ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు నీరు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు గంగకు 1000 క్యూసెక్యుల నీటిని మంగళవారం విడుదల చేశారు. ప్రస్తుతం నీటి నిల్వలను బట్టి వార బందీ ప్రకారం అయితేనే ఉన్న పంటలకు నీరు సరిపోతుందని, అలా కాకుండా రెగ్యులర్‌గా వదిలితే కష్టమే అంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా కెసి ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగానే మిగలనుంది. సుంకేసుల బ్యారేజ్‌లో నీటి నిల్వలు లేకపోవడం వలన కెసి కింద వరి కంటే ఆరు తడి పంటలకు రైతాంగం మొగ్గు చూపడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పోతిరెడ్డి పాడు నుండి మల్యాల ఎత్తిపోతల పథకంకు 1,688 క్యూసెక్యుల నీరు ఇన్ ప్లో ఉంది. ఆ నీటిని లిప్ట్ చేసి కెసికి వదలాలి. అయినా ఆ నీరు సరిపోయో పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కెసి కింద దాదాపు లక్ష ఎకరాలు పంటలు సాగు అయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏదేమైనా ఉన్న నీటి లభ్యతను బట్టి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతుంది. వరుణుడు కరుణిస్తేనే పూర్తి స్థాయిలో రైతుల పంటలకు సాగు నీరు ఇవ్వగలమని, లేకుంటే భరోసా ఇవ్వలేమని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది. ఈ నెల 14న జరిగే నీటి పారుదల సలహా మండలి సమావేశంలో జిల్లా పాలన యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..
శ్రీశైలం డ్యామ్










