Jun 21,2023 19:17

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి జూటూరు హేమలత

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపిపి జూటూరు హేమలత, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ తెలిపారు. బుధవారం మండల కార్యాలయంలో ఎంపిపి జూటూరు హేమలత అధ్యక్షతన ఎంపిడిఒ కొండయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం వాడీవేడిగా సాగింది. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముఖ్యఅతిథిగా ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు వివరించారు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉందని డేగలహాల్‌ సర్పంచి నీలకంఠ, దౌల్తాపురం సర్పంచి లక్ష్మీదేవమ్మ, బెల్డోన సర్పంచి సావిత్రి, సంగాల ఎంపిటిసి భీమ లింగ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ అధికారి రామ్‌నీలాను నిలదీశారు. ఆయన సమాధానమిస్తూ... మండలంలో ప్రధానంగా చింతకుంట జలాశయం, కాజీపురం జలాశయం, బెల్డోన జలాశయం నుంచి తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. చింతకుంట జలాశయం నుంచి మండలంలోని ఐదు గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతోందన్నారు. ఈ ఏడాది చింతకుంట జలాశయంలో సరిపడ తాగునీరు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జల జీవన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.2.30 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. తమ గ్రామాలకు విద్యుత్‌ స్తంభాలు కావాలని పలువురు ప్రజా ప్రతినిధులు ట్రాన్స్‌కో ఎఇని నిలదీశారు. అనంతరం ఎంపిపి, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మాట్లాడారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించడానికి, సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించడానికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అధికారులందరూ సహకారమందిస్తే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని కోరారు. వైసిపి యువ నాయకులు జూటూరు మారయ్య, వైస్‌ ఎంపిపిలు నరసింహులు, పద్మావతి, సర్పంచులు గోవిందరాజులు, రోహిణి, మల్లమ్మ, ఎంపిటిసిలు సుమలత, సరోజమ్మ, సుంకన్న, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, పిఆర్‌ ఎఇ చోళ రెడ్డి, ఎపిఎం నాగార్జున, సూపర్‌వైజర్‌ ప్రసూన, ఎఇఒ రమాదేవి, ఎపిఒ మాధవ శంకర్‌, ఎంఇఒ చక్రధర్‌ పాల్గొన్నారు.