Aug 15,2021 12:07

ఎదలో ఎపుడూ
ప్రశ్నల మొలకలు మొలుస్తుంటాయి.
అవి పెరిగి, పెద్దవిగా మారి
మర్రి ఊడలై.. మహా వృక్షాలుగా దర్శనమిస్తున్నాయి.

ఆ ప్రశ్నలిప్పుడు బలహీనుల గొంతులను వినిపిస్తున్నాయి.
బక్కచిక్కిపోయిన దేహాన్ని తడుముతున్నాయి.
ఆకలి చప్పుళ్లను వింటున్నాయి.
చీకటినిండిన బతుకుల్లో వెలుగుదారి
చూపటానికి కాంతికిరణాలను వెతుకుతున్నాయి.
నోటికాడికి నాలుగు మెతుకులు రావడం కోసం..
ఈ ప్రపంచమంతా పరుగెడుతున్నాయి ప్రశ్నలు.

కొన్ని పదునైన కత్తులు
ఆ ప్రశ్నలను
వెంటాడుతున్నాయి.
వాటి గొంతులను కోసి సమాధి చేయడానికి.
కొన్ని అరాచక శక్తులు కాపు కాసుకొని
కూర్చున్నాయి.
వాటిని నలిపేయడానికి
ప్రశ్నల చుట్టూ
ఉచ్చులను బిగిస్తున్నాయి
ఉపిరాడకుండా చేయడానికి.

ఆ ప్రశ్నలెప్పుడు చురకత్తులే
అవి తిరగబడే శక్తులు
అన్యాయం, అరాచకం అనే పొత్తికడుపుల్ని చీల్చే కత్తెరలు
అవినీతి కొమ్మలను నరికేసే
పదునైన కొడవళ్లు
వాటికి చావులేదు.
సమాధులని చీల్చుకొని పైకొస్తాయి.
మహావృక్షాలై పాతుకుపోతాయి.
అవినీతిపరుల గుండెల్లో
గుణపాలు దింపుతాయి.
అణగారిన వర్గాలకు
అండగా నిలబడి
జవాబులు రాబడతాయి.
రాజ్యాధికారం కోసం
ఆ ప్రశ్నలెప్పుడూ
ప్రశ్నిస్తూనే ఉంటాయి.
పేదవాడి గొంతుకై

అశోక్‌ గోనె
94413 17361