May 21,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న మహేష్‌ యాదవ్‌

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, లోపాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదని జనసేన పార్టీ నాయకులు మహేష్‌ యాదవ్‌, రాజశేఖర్‌, విజరు కుమార్‌, జయరాం విమర్శించారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలో ఉన్న వారిని విమర్శించడం, ప్రశ్నించడం సహజమన్నారు. చిన్న లోపాలను కూడా సోషల్‌ మీడియాలో ఎత్తి చూపితే దాడులకు దిగి భయాందోళనకు గురి చేయడం వైసిపి నాయకులకు పరిపాటిగా మారిందని తెలిపారు. ఆదోనిలో తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని, దమ్ము, ధైర్యం ఉంటే ప్రమాణం చేయాలని ఇటీవల టిడిపి నాయకుడు ఉమాపతి నాయుడు విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వకుండా వైసిపి నాయకులు సైలెంట్‌ కావడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్ల చులకన భావనతో మాట్లాడుతూ అసభ్య పదజాలం వాడి దాడికి యత్నిస్తూనే ఉన్నారని, తాము కూడా తిప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.