Feb 24,2021 06:32

స్పార్టకస్‌ చరిత్రలో గొప్ప పోరాట యోధుడు. బానిసల పక్షాన యజమానులపై తిరుగుబాటు చేసిన మహోన్నత నాయకుడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, సమానత్వం కోసం ప్రాణాలర్పించాడు. స్పార్టకస్‌ వీరోచిత చరిత్రకు మార్క్స్‌ మహనీయుడు ముగ్ధుడయ్యాడు. బహుశా అందుకే కావచ్చు, స్పార్టకస్‌ను తన హీరోలలో ఒకరిగా చెప్పుకున్నాడు. 'ప్రాచీన చరిత్రలో గొప్ప వ్యక్తిగా, పురాతన శ్రామికుల నిజమైన ప్రతినిధి స్పార్టకస్‌' అని ఆ వీరుడిని మార్క్స్‌ కొనియాడాడు.


ప్రజాస్వామ్య భారతవనిలో వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దు కోసం కొనసాగుతున్న మహత్తర పోరులో సుమారుగా 250 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చట్టాల వల్ల రైతులు కూలీలవుతారు. కార్పొరేట్‌ వ్యవసాయ యజమానుల చేతిలో క్రమంగా బానిసలుగా మారే ప్రమాదం రాబోతుంది. ఈ ప్రమాదం నుంచి బయట పడేందుకు స్పార్టకస్‌ స్ఫూర్తి మనకవసరం. ఆ స్ఫూర్తిని రైతులు కొనసాగిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే భవిష్యత్తు తరాలకు వ్యవసాయం పండుగ కావాలని ఆశిస్తున్నారు. నల్ల చట్టాల రద్దుకై రాజ్య కుట్రల్ని ఛేదించుకొని స్పార్టకస్‌లై నినదిస్తున్న ఈ పోరాటం ప్రజాస్వామిక శక్తులకు ప్రేరణ. ప్రస్తుత స్థితిలో స్పార్టకస్‌ను తలచుకోవడం సముచితంగా ఉంటుంది.


ఆనాటి సమాజంలో ఒకరి నుంచి మరొకరికి అమ్మకం ద్వారా వచ్చిన బానిసల్లో స్పార్టకస్‌ ఒకరు. మల్ల యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి. యుద్ధ రణరంగంలో మరణం తప్పదని తెలుసు. 'అయినా జీవించాలి' అనుకుంటాడు. తన కోసం, తనవారి కోసం, తను ప్రేమించే ఈ ప్రపంచం కోసం జీవించాలి అనుకుంటాడు. వారి కోసం పోరాడాలి అనుకుంటాడు. ఎందుకంటే తన తండ్రి, తన తాత.. ఎవరూ స్వేచ్ఛా వాయువులతో ఒక్క క్షణం జీవించ లేదని, బానిసగా స్వీయ అనుభవంలో తాను తెలుసుకున్నాడు కాబట్టి.


బతకడం వేరు.. జీవించడం వేరు. బతకడం అంటే ఏదోలా బతికేస్తాం. జీవించడం అంటే కష్టం. దాన్ని సార్థకం చేసుకోవడం ఇంకా కష్టం. జీవించడంలోని ప్రేమను, ఆ మాధ్యుర్యాన్ని, గొప్ప తనాన్ని గుర్తించడం, దానిని పొందడం కోసం స్పార్టకస్‌ పోరాడాడు. కాబట్టే జీవించి పోరాడి మానవాళి చరిత్రలో ఇంకా జీవించి ఉన్నాడు. పోరాటాలు ఉన్నంతకాలం ఈ సమాజం కోసం ప్రేమను పంచుతూనే ఉంటాడు. ఆ ప్రేమను బతికించడం కోసం పోరాటాలు ఎలా చేయాలో చెబుతూనే ఉంటాడు. బానిస సమాజం నుంచి నేటి సమాజం వరకు ఆయనలాంటి స్పార్టకస్‌లెందరో పుట్టారు. వారంతా వివిధ మార్గాల్లో పోరాడుతూ వచ్చారు. అలా చరిత్రలో నిలబడ్డారు. కాలంతోపాటు స్వరూపం మారింది అంతే. వివిధ రూపాలలో రాజ్య క్రూర అణచివేతలపై, శ్రమ దోపిడీపై పోరాటం జరుగుతూనే ఉంది.


రోమన్‌ సామ్రాజ్యంలో బానిసలకు నాయకత్వం వహించాడు స్పార్టకస్‌. కనీస స్వేచ్ఛ లేని రాజ్యం. తమ అభిప్రాయాన్ని ప్రకటించలేని దీనస్థితి. మనుషుల్ని పనిముట్లుగా చూస్తున్న కాలం. శ్రమని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న తరుణంలో స్పార్టకస్‌ తిరుగుబాటును రాజ్యం అంగీకరిస్తుందా? లేదు అంగీకరించదు. శిలువకు వేలాడదీసి క్రూరమైన హింసతో బానిసల్ని అణచి వేయడం ఆనాటి రాజ్య ధర్మం. హింస ద్వారా బానిసల్ని లొంగ తీసుకోవడం, హత్యలు చేయడం రాజ్యం చేసే అకృత్యాల్లో ప్రధానమైనవి. మనిషిని ప్రేమగా చూడడం అనేది ఎడారిలో ఒయాసిస్సు లాంటిదే. 'ప్రేమతో కూడిన సమాజం నిర్మించబడాలి. దోపిడీ, పీడన లేని బతుకులు కావాలని' స్పార్టకస్‌ కోరుకున్నాడు. స్పార్టకస్‌ ఆలోచనలకు ఆయన సహచరి వరీనియా మద్దతు ఉంది. స్వతంత్ర ఆలోచనాపరులైన వరీనియా జీవితాన్ని పంచుకోవడంతో పాటు స్పార్టకస్‌ ఆలోచన విధానాన్ని కొనసాగించింది. వారిలో ఒకరు చనిపోతే మరొకరు చనిపోకూడదని, వారి జ్ఞాపకాల్ని పదిలపరచడం కోసం మరొకరు జీవించాలనుకున్నారు. ఇప్పుడు దేశంలో రైతుల పోరాటంలో అదే జరుగుతుంది. ప్రత్యక్షంగా మహిళల భాగస్వామ్యం పెరిగింది. తల్లిదండ్రులు పోరాటంలో ఉంటే వారి పిల్లలు పొలం పనుల్లో ఉన్నారు. రైతు బతుకు భరోసా కోసమే కాదు. దేశ భద్రతకై నిలబడ్డారు.


ఉన్నతమైన ఆలోచనల నుంచి వీరుడిగా ధీరుడిగా తీర్చిదిద్దబడి బానిసల తిరుగుబాటుకు నాయకత్వం వహించి, యుద్ధంలో వీరోచితమైన చావు పొందాడు స్పార్టకస్‌. ముక్కలు ముక్కలుగా నరికి చంపి అతడిని రోమన్‌ సామ్రాజ్యం గొప్పలుగా చెప్పుకుంది. స్పార్టకస్‌ భౌతికంగా దూరమైనా రోమన్‌ సామ్రాజ్యంలో పెను తుఫానుకు కేంద్రం అయ్యాడు. ప్రజలు ఆయనను సొంతం చేసుకున్నారు. ఇదే వరుసలో రైతాంగ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమాన్ని రాజ్యం వక్రీకరిస్తోంది. దేశద్రోహులంటూ అపవాదు వేస్తుంది. విదేశీ శక్తుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు చేస్తుంది. కార్పొరేట్లకు బానిసలైన పాలకులు రైతులను నిందించడం దేశ ద్రోహం కాదా? బానిసలుగా మారేందుకు రైతులు సిద్ధంగా లేరు. అందుకే పోరాడుతున్నారు. ఆ పోరాటంలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది. అందులో అందరికీ స్పార్టకస్‌ తెలియకపోవచ్చు. కానీ వారు స్పార్టకస్‌ స్ఫూర్తిని పొందినవారు. అందుకే స్పార్టకస్‌ చనిపోలేదు. ప్రపంచ విప్లవాల్లో జీవించే ఉన్నాడు. ఆనాటి ఆయన తిరుగుబాటు తత్వం, ప్రేమ, దయ, కరుణ, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం అన్నింటిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ.. ప్రశ్నిస్తున్న గొంతుకలంతా స్పార్టకస్‌ లే.
                                               * ఎం.రమేష్‌ రాజా, సెల్‌ : 78932 30218