May 11,2023 02:19
విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న దశ్యం

ప్రజాశక్తి అద్దంకి: ప్రశ్నించేతత్వాన్ని ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని, తద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ డిగ్రీ కాలేజ్‌లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న సమ్మర్‌ కిడ్‌ క్యాంప్‌ బుధవారం ఉత్సాహంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సమాజం కోసం జెవివి కృషి చేస్తుందని, అందులో భాగంగా చెకుముకి ద్వారా పిల్లలకు సైన్సు బోధించడం, సైన్స్‌ మొబైల్‌ ల్యాబ్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగాలకు ప్రాధాన్యత కల్పించడం, చెకుముకి టాలెంట్‌ టెస్టుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికి తీయడం కార్యక్రమాలతోపాటు ఇటువంటి సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంకల్పం, పట్టుదల, కషి ఉంటే ప్రతి విద్యార్థి విజయాలు సాధిస్తారని ఎన్టీఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రత్తయ్య అన్నారు. మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో జెవివి ముందుంటుందని ఆయన ప్రశంసించారు. భౌతికంగా జరిగే ప్రతిదీ కారణం తోనే జరుగుతుంటుందని, దానిని గుర్తించడం ద్వారానే విద్యార్థుల్లో చైతన్యం పెరుగుతుందని అన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే ఇతర భాషలను నేర్చు కోవాలని, చదువుతోపాటు ఆటలు పాటల్లో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. గత ఆరు రోజుల్లో క్రాఫ్ట్‌ క్లాసు, సైన్స్‌ క్లాసు, పాటలు, డాన్స్‌, బూమర్‌ వెపన్‌, సైన్స్‌ ఎక్స్‌పరిమెంట్స్‌, కథలు వంటి అంశాలు తమకు బాగా నచ్చా యని, ఇవి తమకు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నా మని ముగింపు సందర్భంగా విద్యార్థులు చెప్పారు. జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు మనం త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి తంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారైనా 40 మంది విద్యార్థులు ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్న టీచర్లు, ప్రముఖులు పాల్గొని పాఠ్యాంశాలను బోధించారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో మరింత నాణ్యంగా, శిబిరం ఎక్కువ రోజులు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా రంగాల బాధ్యులు కే రఘుచంద్‌, జి వెంకట్రావు, ఎం సుబ్బారావు, చంద్రశేఖర్‌, పోతురాజు, తంగిరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. కార్యక్రమానంతరం శిక్షణ శిబిరంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు బహమతులను అందజేశారు. ఈ క్యాంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.